నడక కూడా సత్ప్రవర్తనను తెలియచేస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మరాళీమందగమనా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 47 వ నామం.

" మరాళీమందగమనా " అంటే ఆడుహంసవలె నెమ్మదిగా నడుచును అని.

హడావిడిగా తొట్రుపడుతూ నడిచేది ఎవరు?. ప్రమాదంలోనో, సమస్యలోనో చిక్కుకున్నవారు, పని తనవల్ల అవుతుందో లేదో అని సందేహంతో సతమతమయేవారు అలా హడావిడిగా నడుస్తూంటారు. అమ్మవారికి అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది.‌ అమ్మవారికి చేతకాని పనీ ఉండదు, సమస్యా ఉండదు. అందుకే అమ్మవారు ప్రశాంతంగా నెమ్మదిగా నడుస్తారు.

అమ్మవారి రూపం, మాటలు, చూపులు, నడక అన్నీ కోమలమే. సందేహం ఏముంది.

ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:

" పదన్యాసక్రీడాపరిచయమి వారబ్ధు 

  మనసః స్ఖలంత స్తే ఖేలం 

  భవనకలహంసా న జహతి, 

  అత స్తేషాం శిక్షాం సుభగమణి

  మంజీర రణితచ్ఛలా దాచక్షాణం 

  చరణకమలం చారుచరితే "    

                                  - 91 

" అమ్మా! నీ వనములో నున్న హంసలు నిన్ను చూసి నీలాగ నడవాలని ప్రయత్నించి తడబడుచున్నాయి. నీ పాదాలకు ఉన్న మంజీరములు ఆ హంసలకు నీలాగ ఎలాగ నడవాలో చెప్పుచున్నాయి. నీ నడక హంసలకే నడక ఎలా నడవాలో నేర్పుతోందమ్మా " అని.

పరమాత్మను అర్జునుడు అడుగుతాడు " స్థితప్రజ్ఞుడు ఎట్లు భాషించును? ఎట్లు కూర్చొనును? ఎట్లు నడచును? " అని.

పరమాత్మ ఇలా తెలియచేసారు:

" విహాయ కామాన్యః సర్వా

  న్పుమాంశ్చరతి నిఃస్పృహః,

  నిర్మమో నిరహంకారః 

  స శాంతిమధిగచ్ఛతి "

               - భ.గీత 2:71 

" ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను/నాది అన్న భావన లేకుండా, మరియు అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది " అని.

స్థితప్రజ్ఞత పొందిన యోగే అలా ప్రశాంతంగా ఉండగలిగితే అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉంటారు. అమ్మవారికి నా అనేవారు, పరాయివారు అనే భేదం ఉండదు. అమ్మవారు పొందవలసినది ఉండదు, పొందలేనిదీ లేదు. అందుకే అమ్మవారి నడక కూడా నెమ్మదిగా, ప్రశాంతంగా మన మనస్సులకు ఆనందం కలిగించేదిగా ఉంటుంది.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ