దేవతలకు కూడా మూడు గుణాలూ ఉంటాయి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" గుణనిధిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 604 వ నామం.
" గుణనిధిః " అంటే గుణముల నిధి, గని.
గుణాలు మూడు - సత్వరజోతమస్సులు. అమ్మవారు చల్లనితల్లి. సత్వగుణమే కదా కలిగి ఉండాలి. అన్ని గుణములకు నిధి ఎలా.
" అతి సర్వత్ర వర్జయేత్ " అన్నారు. ఏ గుణమయినా ఎక్కువ అయితే సమస్యే. మంచితనం వల్ల కూడా సమస్యల పాలవుతూంటాం అప్పుడప్పుడు. అలాగే రజోతమో గుణాలు కూడా కొంతవరకూ అవసరమే.
రుద్రనమకంలో మొదటిశ్లోకంలో " నీ కోపమునకు నమస్కారము " అని ప్రార్థిస్తాం. ఆయనకు కోపంలేకపోతే మనకు రక్ష ఎలా, మనకు ఎవరయినా హానిచేస్తే ఆయనకు కోపం రాకపోతే ఎలా.
పిల్లవాడు చేయకూడని, వాడికే హానిచేసే పని చేస్తూన్నప్పుడు తల్లి ఏయ్ అంటుంది కళ్ళు ఎర్రచేసి. అవసరమయితే వీపుమీద ఒకటి వేస్తుంది. అప్పుడే ఆ పని తప్పు అని పిల్లవాడు తెలుసుకుంటాడు. ముద్దుగా నవ్వుతూ " తప్పమ్మా " అంటే వాడికి తెలియదు.
తమోగుణం అంటే అజ్ఞానం. మరుపు. కొన్ని విషయాలలో మరుపు ఒక వరం. మరుపు లేకపోతే జీవితం దుర్భరం. కొన్ని సమయాలలో అజ్ఞానం కూడా సంతోషాన్ని ఇస్తుంది. పిల్లవాడు ఎంత ఆనందంగా ఉంటాడో. వాడికి ఏమీ తెలియదు, పట్టదు.
ఓ గ్రామంలో భయంకరమైన పాము ఉండేది. దాని కాటువల్ల చాలామంది మనుషులు, జంతువులు చనిపోవడం జరిగింది. ఆ ఊరికి ఓ ఋషి వస్తే ఆయనకు మొర పెట్టుకున్నారు ప్రజలు. ఆయన పాముని ఇటుపై కాటువేస్తే మరణిస్తావు అని శపించి వెళ్ళిపోయారు. కొంతకాలం తరువాత ఋషి ఆ గ్రామంమీదుగా వెడుతూ పాము ఎలా ఉందో చూద్దామని వెళ్ళారు. అది చిక్కిపోయి ప్రాకడానికి కూడా ఓపిక లేకుండా ఉంది. ఈయన ఆశ్చర్యపోయారు. మీరు శపించడం కారణంగా చిన్న పిల్లలకు కూడా అలుసయి పోయాను. బయటకు వస్తే రాళ్ళతో కొడుతున్నారు అందరూ అంది పాము. ఋషి అన్నారు " నేను కరవవద్దన్నాను కాని బుస కొట్టవద్దని చెప్పలేదు కదా. బుసకొట్టి భయపెడుతూండాలి నీ దగ్గరకు ఎవరయినా వస్తే " అని చెప్పి వెళ్ళిపోయారు.
అలా అన్ని గుణాలూ కొంతవరకూ అవసరమే, సంతోషాన్ని కూడా కలిగిస్తాయి.
అన్ని గుణాలూ ప్రకృతిపరంగానే కలుగుతాయి. ప్రకృతే అమ్మవారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment