మాతృదినోత్సవం నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
నేడు " మాతృదినోత్సవం " గా జరుపుకుంటారు అందరూ. భారతీయులకు ప్రతీరోజూ మాతృదినోత్సవమే. తైత్తిరీయోపనిషత్తు ( 1:11:2 ) మొదట " మాతృదేవోభవ " అని ప్రార్థించమంది.
మన వేదాలని ( 20500 మంత్రాలు ), ఉపనిషత్తులని, పురాణాలని, శాస్త్రాలని, రామాయణం ( 24000 శ్లోకాలు ), మహాభారతం ( 100700 శ్లోకాలు ), శృతులు, స్మృతులు ముఖ్యంగా మనుస్మృతిని రకరకాల కట్టుకధలు చెప్పి చెప్పి భ్రష్టుపట్టించేసారు.
వేదవిజ్ఞానం ఎంత ఉత్కృష్టమయినది. ఎన్నిరకాల శాఖలు ఎన్ని ఋక్కులు ఎన్ని సూక్తాలు. ఒక వేదంలోని ఒకశాఖని పూర్తిగా చదివి అర్ధం చేసుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. అ ఆ లు రానివాడు కూడా వేదాలు గురించి మాట్లాడడమే.
మాక్స్ ముల్లర్ (1823–1900) అనే జర్మనీ పండితులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సంస్కృత ప్రొఫెసర్ గా ఉండేవారు. ఆయనకు భారతదేశం మీద అపారమైన గౌరవం. వేదాలూ , ఎన్నో ఉపనిషత్తులూ చదివి , వాటిని ఇంగ్లీషులోకి అనువదించారు. 50 మహాగ్రంథాలు రచించారు. ఆయన విద్వత్తుకు ముచ్చటపడి జీవితాంతం ఆ యూనివర్సిటీలో పనిచేసే అవకాశం ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం.
మన ఆంధ్రదేశం నుండి ఇంగ్లాండ్ వెళ్లిన మన వేదపండితులు ఆయన దర్శనం తప్పక చేసుకొనే వారుట. ఆయన ఒక ఋషి లాగా కాషాయపు చొక్కా , శిఖతో, ఒక రాగి చెంబుతో దర్శనమిచ్చేవారుట.
ఆయన్ని భారత్ కు ఓసారి విచ్చేయమని ఎందరో ఆహ్వానించేవారుట. ఆయన " ఉపనిషత్తుల్లో తాను దర్శించిన ఆనాటి భారతీయ మహత్వం, పవిత్రత ఈ నాటి భారతదేశంలో కనబడకపోతే నా మనసు తట్టుకోలేదు. అందుకని రాలేను. క్షమించండి " అని సున్నితంగా తిరస్కరించేవారుట.
మనుస్మృతి లో " నస్త్రీ స్వాతంత్ర్యమర్హసి ( 9:3 ) " అని ఉందిట. స్త్రీకి స్వాతంత్ర్యం అక్కరలేదంటాడా, అలా ఎలా అంటాడు అని ఓ చర్చ. ఆయనే " యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ( 3:56 ) " అన్నారు కదా. దానిగురించి మాట్లాడరు. దేవతలందరికీ అధిపతి అమ్మవారు. మొదటగా " మాతృదేవోభవ " అనమన్నారు, అమ్మ తరువాతే ఎవరయినా. యమద్వితీయ నాడు మగవారు అందరూ వారి సొదరీమణుల ఇంటికి వెళ్ళి భోజనం ( భగినీ హస్త భోజనం ) చేస్తే ఆయుష్షు పెరుగుతుందని తెలియచేస్తున్నాయి పురాణాలు. శ్రావణపౌర్ణమి నాడు రాఖీ కట్టమన్నాయి సోదరీమణులకు.
ఆదిశంకరులు దేవీ అపరాధక్షమా స్తోత్రంలో " కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి " - చెడ్డ కొడుకు ఉంటాడేమోకాని చెడ్డతల్లి ఎప్పుడూ ఉండదు " అన్నారు. స్వతంత్ర్యం ఉండకూడదంటే కట్టిపడేయడం కాదు, ఒంటరిగా వదిలేయకు, ఎప్పుడూ తోడుండు, భద్రంగా చూసుకో అని.
ఒక అన్యమతస్తుడు ( మొన్నటికి మొన్న ) " మనుస్మృతి " ని పొగుడుతూ " అద్భుతం " అని అనడం చదివినప్పుడు ఆనందమూ బాధా కలిగాయి. ఎంత భ్రష్టుపట్టించేసారు మన సనాతనధర్మాన్ని అని బాధ కలుగుతుంది.
" ఎద్దుకేమి తెలుస్తుంది అటుకుల రుచి " అని సామెత. సనాతనధర్మం విషయంలో ఈ సామెత నిజమేనని అనిపిస్తూంది.
నేడు " మాతృదినోత్సవం ". మనకు జన్మనిచ్చి తీర్చిదిద్దిన తల్లికి, మన కష్టసుఖాల్లో తోడూనీడగా నిలిచిన మాతృమూర్తులకు, చక్కటి సంస్కృతి సంప్రదాయాలను ప్రసాదించిన దేశమాతకు నమస్కారములు, కృతజ్ఞతలు తెలుపుకుందాం.
సర్వే జనాః సుఖినో భవంతు. హమారా సనాతనధర్మ మహాన్ - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment