పునర్జన్మను ప్రతిపాదించినది మన సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" ప్రాప్య పుణ్యకృతాం 

  లోకానుషిత్వా శాశ్వతిః సమాః,

  శుచీనాం శ్రీమతాం గేహే 

  యోగభ్రష్టో2భిజాయతే "

                - భ.గీత 6:41

" అథవా యోగినామేవ 

  కులే భవతి ధీమతామ్,

  ఏతద్ధి దుర్లభతరం 

  లోకే జన్మ యదీదృశం "

          - భ.గీత 6:42

" విజయవంతం కాని యోగులు, మరణం తరువాత, సద్గురువుల నివాసాలకు వెళతారు. అనేక యుగాలు అక్కడ నివసించిన తరువాత, వారు మళ్లీ భూతలంలో పుణ్యాత్ములు మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేకుంటే, దీర్ఘకాలంగా యోగాభ్యాసం చేయడం వల్ల వారు వైరాగ్యాన్ని పెంచుకున్నట్లయితే, వారు దైవిక జ్ఞానంతో కూడిన కుటుంబంలో పుడతారు. అటువంటి జన్మ ఈ లోకంలో పొందడం చాలా కష్టం " అని తెలియచేసారు పరమాత్మ.

ఇక్కడ పరమాత్మ " సంపన్నుల గృహంలో " అన్నారు. సంపన్నులు అంటే డబ్బున్న వారు అని కాదు. ఆధ్యాత్మికంగా సంపన్నులు. ఎప్పుడూ దైవధ్యానం చేస్తూ, సంప్రదాయాలు పాటిస్తూ సాత్వికంగా జీవించేవారు అని గ్రహించాలి. అప్పుడే ఆ జీవుడు తరించి జన్మరాహిత్యాన్ని పొందడానికి వీలవుతుంది.

ఎంత అద్భుత విషయం. పునర్జన్మ ప్రతిపాదించినది సనాతనధర్మం. ఎన్నో పురాణాలలో ఎన్నో విషయాలను పునర్జన్మల గురించి తెలియచేసారు మన ఋషులు. ఏయే కర్మలు చేస్తే ఎటువంటి పునర్జన్మలు కలుగుతాయో కూడా తెలియచేసారు. 

పరమాత్మ చెప్పినది సఫలం కాని యోగులు దానికోసం మళ్ళీ జన్మ తీసుకుంటారన్నారు. యోగులు అంటే సాధకులు. ఉదాహరణకు ఈజన్మలో సంగీతసాధన మొదలుపెడతారు. పూర్తిగా సఫలం కాకపోవచ్చు. అటువంటి వారు మళ్ళీ జన్మ తీసుకుని నిష్ణాతులవుతారు. 

మనం ఎన్నో వార్తలు చదువుతూంటాం, చూస్తూంటాం. నిండా 5/6 ఏళ్ళ వయస్సు కూడా ఉండని పిల్లలు అద్భుతంగా పాడుతూంటారు. ఎన్నో క్లిష్టమైన సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు చెబుతూంటారు. అటువంటి వారిని బాల మేధావులు అని ముద్దుగా పిలుస్తూంటాం. కాని అవన్నీ వారి గత జన్మల సాధనలకు కొనసాగింపుగా అర్ధం చేసుకోవాలి.

జీవుల కర్మఫలాల ఫలితాలను, జననమరణాలను, సంబంధిత కారణాలను మన ఋషులు కాచి వడపోసేసారు.

మన ఋషుల విద్వత్తును అర్ధం చేసుకోవడానికి ఇప్పటి మనుషులకు ఇప్పుడు ప్రయత్నం ప్రారంభిస్తే కనీసం కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది.

అదీ మన సనాతనధర్మం విశిష్టత.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ