గుర్రానికి కళ్ళెంవేసి గంతలు కట్టినట్లు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" పశుపాశ విమోచనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 354 వ నామం.

" పశుపాశ విమోచనీ " అంటే ఆజ్ఞానులగు జీవులను బంధములనుండి విడిపించునది అని భాష్యం చెప్పారు. ఇక్కడ బంధాలు అంటే అనవసరపు బంధాలని అర్ధం చేసుకోవాలి. జీవితం ప్రశాంతంగా గడిచిపోవడానికి కొన్ని బంధాలు అవసరమవుతాయి. 

ఉదాహరణకు గురుశిష్య బంధాలు, తల్లిదండ్రుల పిల్లల బంధాలు అవసరమే, వదులుకునేవి కావు. 

కఠోపనిషత్తు అద్భుతమయిన విషయం తెలియచేసింది:

" ఆత్మానం రథినం విద్ధి, 

  శరీరం రథమేవ తు

  బుద్ధిం తు సారథిం విద్ధి 

  మనః ప్రగ్రహమేవ చ.

  ఇన్ద్రియాణి హయానాహు

  ర్విషయాంస్తేషు గోచరాన్

  ఆత్మేన్ద్రియమనోయుక్తమ్ 

  భోక్తేత్యాహుర్మనీశిణః " 

              - 1.3.3,4

ఆత్మ రథికుడని తెలుసుకో.  శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఆ గుర్రాలు విషయాల వైపుకు పరుగులు తీస్తాయి.  ఇటువంటి శరీరేంద్రియ మనస్సులతో కూడిన జీవుడు భోక్త అని పెద్దలు అంటారు.

శరీరస్థుడైన ఆత్మ మనోబుద్దుల ద్వారా ఇంద్రియాలను నియంత్రించి, అవి విషయాల వైపుకు వెళ్ళకుండా చూచుకుంటేనే గమ్యం చేరతాము " అని తెలియచేస్తూంది ఈ ఉపనిషత్తు.

గుర్రంకి కళ్ళకు ప్రక్కన గంతలు కడతారు, కళ్ళెం వేస్తారు. ప్రక్కలకు చూడకుండా ఎదరకే చూస్తూ వేగంగా వెళ్ళడానికి. ఇంద్రియములను అలా నిగ్రహించమన్నారు. 

ఎంత అద్భుతం మన వాజ్మయం. ఈ ఇంద్రియనిగ్రహం కలిగి ఉండాలన్నా, అనవసరపు బంధాలు తొలగాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాలి.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ