సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సామరస్యపరాయణా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 792 వ నామం.

" సామరస్యపరాయణా " అంటే హెచ్చుతగ్గులు లేని శివశక్తి భావము నివాసముగా గలది అని భాష్యం చెప్పారు.

" సామరస్యం " అనే మాటను తరచుగా వింటూంటాం. కొంచెం సామరస్యంగా వ్యవహారాన్ని పరిష్కారించుకుంటే నయమేమో అంటూంటారు పెద్దవారు, ఆలోచనాపరులు. ఎంత పెద్దవారయినా పరిస్థితులను చూసి ఎదరకు అడుగు వేయాలి. ఎల్లప్పుడూ " నాకు ఎదురు లేదు " అనే అహం పనికిరాదు.

హనుమ " జ్ఞానినాం అగ్రగణ్యం ".‌ అమ్మవారి అనుగ్రహం కూడా ఎక్కువే. ఇటువంటి లక్షణాలన్నీ హనుమలో కనబడుతాయి. 

సుగ్రీవుడు తామున్న చోటికి వస్తూన్న రామలక్ష్మణులను గమనించి భయపడి పోతాడు. తనను చంపడానికని వాలియే ఎవరినో పంపించాడని ఊహించుకుని. హనుమ " అసలు వారు ఎవరో, ఎందుకు వస్తున్నారో తెలిసుకోకుండా ఎందుకు అంత అతిగా ఆలోచించడం. నేను వెళ్ళి విషయాలు తెలుసుకుని వస్తాను. భయపడకండి " అంటారు సుగ్రీవుడితో.

మొదటిసారి హనుమ రాముడితో మాట్లాడినప్పుడు రాముడు హనుమ మాటతీరుకి ఆశ్చర్యపోయి లక్ష్మణుడితో అంటారు " ఇటువంటి వారు ఎవరికి దూతగా ఉంటారో వారి పనులన్నీ చక్కగా జరిగిపోతాయి " అని.

హనుమ " రామదూత " గా లంకకు వెళ్ళారు. దారిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళమని మైనాకుడు కోరితే " ఇప్పుడు సమయంలేదు నాయనా " అని మృదువుగా చెప్పి ఎదరకు వెళ్ళిపోయారు. దారిలో సురస ఎదురుపడి తన నోట్లోకి వెళ్ళవలసిందే అంటే సూక్ష్మరూపంలో అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేసి వస్తానమ్మా అని ఎదరకు వెళ్ళిపోయారు. మరి సింహిక అడ్డు పడినప్పుడు ఆమె నోట్లోకి ప్రవేశించి మర్మస్థానాలని దెబ్బకొట్టి చంపేసారు.

లంకలో దిగాక చీకటిపడే వరకూ ఆగి సూక్ష్మరూపంలో మెల్లిగా వెడుతూ ఉంటే లంఖిణి " కః త్వం - ఎవర్రా నువ్వు " అని గద్దిస్తే " లంక అద్భుతంగా ఉంటుందని చెప్పారు, చూద్దామని నెడుతున్నాను " అన్నారు హనుమ. కుదరదు అంది లంఖిణి. హనుమ " మరి ఎవరూ చూడకూడదు అనుకున్నప్పుడు అంత అందంగా ఎందుకు కట్టుకోవడం లంకని " అంటారు అమాయకుడిలా. వేళాకోళం చేస్తున్నావా అని ఒక్కటి కొట్టింది లంఖిణి హనుమను. ఇంక ఉపేక్షించి ప్రయోజనంలేదని ఎడమచేతితో ఒక ముష్టిఘాతం ఇచ్చారు హనుమ. రక్తం కక్కుకుని కళ్ళు తిరిగి క్రింద పడింది లంఖిణి.

సీతమ్మని చూడడం, మాట్లాడడం, అంగుళీయకం ఇవ్వడం అయిన తరువాత హనుమ తిరిగి రాముడి దగ్గరకు వెంటనే వెళ్ళిపోవచ్చు. కాని వెళ్ళలేదు. చక్కటి ప్రణాళికతో రావణుడిని కలిసి సీతమ్మను రాముడికి అప్పగించమని ఎంతో లౌక్యంగా చెబుతారు. హనుమ మాటలకు రావణుడు కూడా ఆశ్చర్యపోతాడు. అంతటి సామరస్యపరాయణుడు హనుమ.

ఎన్నోసార్లు మనంకూడా మనమే ఆశ్చర్యపడేలా అతిగా స్పందించకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తాం, పరిష్కరించుకుంటూంటాం కూడా. అమ్మవారి అనుగ్రహం.

ఇటువంటి అద్భుత మాటతీరును, నేర్పరితనాన్ని అమ్మవారు " సామరస్యపరాయణ " అనుగ్రహిస్తారు భక్తులకు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ