భక్తి ఎంత ఉత్తమమయినదిగా ఉంటే అమ్మవారికి అంత ఇష్టం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" భక్తిప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 118వ నామం.
" భక్తిప్రియా " అంటే భక్తి ( భక్తియే ) ఇష్టముగా గలది అని.
భక్తి " భజ్ " ధాతువు నుంచి వచ్చింది. గరుడపురాణం భజ్ అంటే సేవ అని తెలియచేస్తూంది. అమ్మవారి పూజలో చివరన " నృత్య గీత వాద్యాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి " అని ముగిస్తాం. నృత్యం, కీర్తన వంటివన్నీ సేవలు.
గరుడపురాణం భక్తి కలిగిన మ్లేచ్ఛుడు కూడా " శ్రేష్టుడు, యతి, పండితుడు, ముని " అవుతాడు అని తెలియచేస్తూంది. మ్లేచ్ఛుడు అంటే వర్ణాశ్రమాచారధర్మములు లేని/ఆచరించని దేశములలో పుట్టినవారు అని తెలియచేస్తూంది. ఇప్పుడు విదేశీయులు కూడా సంప్రదాయాలను పాటిస్తూ చక్కటి మన వస్త్రధారణలో కీర్తనలు పాడడం, దేవీదేవతల నామపారాయణం చేయడం చూస్తున్నాం. అటువంటి భక్తి కలిగి ఉండడంతో విదేశీయులు కూడా శ్రేష్టులుగా గౌరవింపబడుతున్నారు నేడు.
ఉద్దవుడు గోపికలతో " మీరు భక్తితో కృష్ణుడిని కీర్తిస్తూ చేసిన గానం మూడు లోకాలనూ పవిత్రం చేసింది. అందుకని మీ పాదధూళిని నా నుదుటిన పెట్టుకున్నాను " అన్నారు.
కంచర్ల గోపన్న తన " దాశరధీ శతకం " లో ఇలా అంటారు:
" ముప్పున గాలకింకరులు
ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము
కుత్తుక నిండినవేళ,
బాంధవుల్ గప్పినవేళ, మీస్మరణ గల్గునొ
గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన
దాశరథీ కరుణాపయోనిధీ "
" ఓ రామా, ముసలితనమున యమభటులు వాకిట ముందునకు వచ్చి యుండగా, రోగ మెక్కువై కఫము గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకొన్నప్పుడు మిమ్ము తలతునో తలపలేనో, భజింతునో భజింపలేనో కాబట్టి యిప్పుడే యా పని నెరవేర్చెదను " అని.
భక్తి అలా ఉండాలి. భక్తి ఎంత ఉత్తమమయినదిగా ఉంటే అమ్మవారికి అంత ఇష్టం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment