సాధన గమ్యం జన్మరాహిత్యమే అవాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" మోక్షస్య కారణం సాక్షాత్
తత్వజ్ఞానం ఖగేశ్వరా "
- గరుడపురాణం
" మోక్షానికి కావలసినది ఆత్మజ్ఞానమే. ఇది లేకుండా ఎన్ని వేదాలు, శాస్త్రాలు చదివినా సత్కర్మలు చేసినా ప్రయోజనం లేదు. ఆత్మజ్ఞానం లేకుండా యజ్ఞాలు యాగాలు చేయడం గాడిదలు గంధపుదుంగలు మోసుకుంటూ వెళ్ళడం లాంటిది. గంధపు సుగంధం గాడిదలకు తెలియదు అని. ఉపవాసం చేసి దేహాన్ని బాధపెట్టడం పాము చావాలని పుట్టను కొట్టడం లాంటిది. పాము ఆత్మ, పుట్ట దేహం. ముందు ఆత్మజ్ఞానం పొందు " అన్నారు విష్ణువు.
అలా అని ఇవన్నీ చేయడం తప్పుకాదు, మానకూడదు. వీటి వల్ల పాపాలు నశిస్తాయి కాని మోక్షం కలుగదు. జీవుడి ఆశయం మోక్షం, జన్మరాహిత్యం కావాలి.
వేల కోట్ల సంపదలు ఉన్నా కొందరికి సుఖం ఉండదు, కొందరు భయంకరమైన మరణంని పొందుతూంటారు. కాని ఇటువంటివన్నీ చూస్తూన్నా అశాశ్వతమైన వాటివెంట ఎందుకు పడుతున్నారు జీవులు అన్నది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాని ఆశ్చర్యమేమీ లేదు ఇందులో.
" లోకో మోహా సురాం
పీత్వా న విభేతి కదాచన "
- గరుడపురాణం.
" లోకులు మోహం అనే సురను త్రాగడం వలన సత్యాన్ని తెలుసుకోలేక పోతున్నారు " అని. అశాశ్వతం అని తెలిసీ మోహాన్ని అంటే బంధాలను పెంచుకోవడం.
బాగా త్రాగిన వానికి చుట్టూ జరుగుతూన్నది ఏమీ తెలియదు. అలాగే మోహం అనే సురను త్రాగేయడం వలన మాయలో పడి కొట్టుకు పోతున్నారు జీవులు.
మాయ తొలగాలంటే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం భక్తివలన కలుగుతుంది. భక్తి కలగాలంటే సత్కర్మలు చేస్తూ ఉండాలి. వేదాలు ప్రతిపాదించిన క్రతువులు, కర్మలు చేస్తూ ఉంటే సత్కర్మలు అలవాటు అయిపోతాయి.
" దేహాభిమానం పోవడం అంత సులభం కాదు. భూమిని చీల్చగలవేమో, మేరు పర్వతాన్ని పడగొట్టగలవేమో కాని ఈ దేహాన్ని మాత్రం నిలబెట్టుకోలేవు. ఏదో ఒకరోజు అది పడిపోయి తీరుతుంది. అందుకని అది నిలచి ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో. దేహాభిమానం ఉన్నంతవరకూ నా మీద దృష్టి పెట్టు. నన్ను స్మరించుకో. అప్పుడు సత్కర్మలు మాత్రమే చేస్తావు. మెల్లిమెల్లిగా ఆత్మజ్ఞానం కలుగుతుంది. అదే తరించడానికి, మోక్షం పొందడానికి ఏకైక మార్గం " అన్నారు విష్ణువు.
ఈరోజు నుంచి జ్యేష్టమాసం. విష్ణ్వారాధన ఉత్తమం.
ఏతత్ సర్వం శ్రీవిష్ణ్వార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment