అమ్మవారు ఆకాశంలో వృక్షంలా కూర్చుని ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" గగనాంతస్థా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 855 వ నామం.
" గగనాంతస్థా " అన్నది ఒక అద్భుతనామం. అమ్మవారు ఆకాశం మధ్యలో కూర్చుని ఉంటారు అని తెలుసుకోవాలి. ఆకాశమే ( ఆకాశం అంటే వెలుగు. శూన్యం కాదు ) అమ్మవారు కదా మరి ఈ అర్ధమేమిటి. దీనికి ఉపనిషత్తులు ఇలా చెబుతున్నాయి :
" వృక్ష ఇవ స్తబ్దో దివితిష్టతి "
అంటే చెట్టువలె స్తబ్దుగా ( పరమప్రశాంతంగా, గంభీరంగా ) ఆకాశంలో కూర్చుని ఉంటారు అని. ఎంత అద్భుత భావన/పోలిక. చెట్టు చూడండి చిగురిస్తుంది, ఆకులు పువ్వులు కాయలు పళ్ళు వస్తాయి. మళ్ళీ అన్నీ రాలిపోయి మోడు అవుతుంది. దీనిని " నిర్వికారం " అనుకోకూడదు - మళ్ళీ చిగురిస్తుంది కదా. అంటే చైతన్యం ఉన్నట్లేకదా. ఒకతను కాయలను/పళ్ళను జాగ్రత్తగా గౌరవంగా కోస్తాడు. ఇంకొకతను రాళ్ళతో కొడతాడు కాయల కోసం. చెట్టుకు ఎన్నో చోట్ల రాళ్ళదెబ్బలు తగులుతాయి. అలా అని అతనికి రుచిలేని లేక చేదు కాయ ఇవ్వదు. ఇద్దరికీ రుచికరమైన కాయలు, పళ్ళు ఇస్తుంది.
అలాగే " అమ్మవారు " తనకళ్ళముందే ఎందరో జన్మలను తీసుకూంటూ ఉండడం, ఎందరో సంతోషాలను దుఃఖాలను అనుభవిస్తూ ఉండడం , ఎందరో జన్మలను చాలిస్తూ ఉండడం చూస్తూ ఉంటారు కాని ఆవిడకు ఇవేమీ పట్టవు, ఎవరి కర్మఫలాలను వారు అనుభవించేలా చూస్తూ సృష్ఠిని లయబద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చెట్టుతో పోల్చి ఎంతటి అద్భుత పోలికను చెప్పాయి ఉపనిషత్తులు.
" మహాపద్మాటవీసంస్థా, కదంబవనవాసినీ " అనే నామాలతో అమ్మవారిని పూజిస్తారు. పద్మాలు, కదంబచెట్లు ఉన్న అడవుల్లో నివసిస్తారు అమ్మవారు.
వృక్షాన్ని పూజించడం నేర్పింది మన సనాతనధర్మం. అది మూఢపుపని అన్నారు అన్యదేశాలవారు. ఇప్పటికి జ్ఞానోదమయింది వారికి. చెట్లగొప్పదనం, వాటి సమాజహితం అర్ధమవుతూంది అందరికీ. అమ్మవారిని వృక్షరూపంలో దర్శించారు మన ఋషులు. ఎంతటి అద్భుత భావన. వృక్షో రక్షతి రక్షితః.
అమ్మవారు " వృక్షం " వలే ఉంటుందని గ్రహించి ఎవరికర్మలకు వారే బాధ్యులనే ఎరుక గలిగి " సత్కర్మలు " మాత్రమే చేస్తూ జన్మను సార్ధకం చేసుకోవాలి. అలా సార్ధకం చేసుకునే అవకాశాన్ని అనుగ్రహించమని అమ్మవారిని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment