విగ్రహం మన తృప్తి కోసం, సాధనకోసం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" వ్యక్తావ్యక్త స్వరూపిణీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 399వ నామం.
అమ్మవారు వ్యక్తము, అవ్యక్తమూ కూడా. కొందరు సాధకులు ఉంటారు. వారికి మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి నిలుస్తుంది. వారికి ధ్యానం చేయడానికి అమ్మవారి రూపం అక్కరలేదు. కాని కొందరికి మనస్సు అంత సులువుగా నిలవదు. వారికి అమ్మవారి ఒక చక్కటి రూపం కావాలి ధ్యానం చేయడానికి.
విగ్రహారాధన మంచిదా, అవసరమా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇది ఇప్పటి సమస్యకాదు. పరమాత్మ గీతను బోధించినప్పుడే అర్జునుడికి ఈ సందేహం వచ్చింది.
" ఏవం సతతయుక్తా
యే భక్తాస్త్వాం పర్యుపాసతే,
యే చాప్యక్షర మవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః "
- భ.గీత 12:1
" నీ విశ్వరూపాన్ని ( దివ్యమంగళవిగ్రహాన్ని ) పూజించేవారు కొందరు, అవ్యక్తము నాశనరహితము అయిన పరబ్రహ్మరూపాన్ని కొలిచేవారు కొందరు వీరిలో ఎవరు శ్రేష్ఠులు " అని అడిగాడు అర్జునుడు. ఇద్దరూ శ్రేష్ఠులే అన్నారు స్వామి.
కృష్ణపరమాత్మ అవతారాన్ని ముగించే ముందు ఉద్దవుడికి ఎన్నో ధర్మసూక్ష్మాలు చెబుతారు. ఉద్దవుడు ఏడుస్తూ " నీ పాదం భూమిమీద ఉండడంవల్ల కలి ప్రవేశించడానికి భయపడుతున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలా, ఏమిటి జీవుల పరిస్థితి " అని అంటారు.
కృష్ణుడు ఏడుస్తూన్న ఉద్దవుడుతో " నేను వ్యక్తరూపాన్ని ఉపసంహరిస్తున్నాను కాని నా సమగ్ర ( అవ్యక్త) రూపాన్ని భాగవతామృత సముద్రంలో ప్రవేశింప చేస్తున్నాను. అది పారాయణ చేసి తరించవచ్చు సులభంగా " అన్నారు.
అందుకే భక్తితో రామాయణం అవీ చదువుతూన్నప్పుడు ఆ ఆ పాత్రలు మన కళ్ళముందర కదులుతూ ఉంటాయి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment