సాధనతో మనస్సు శుద్ధి అవుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సర్వాంతర్యామినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 819 వ నామం. 

" సర్వాంతర్యామినీ " అంటే అందరి అంతఃకరణాలని నిర్ణయించేది , అన్ని జీవుల్లోనూ కొలువై ఉంటుంది అని అర్ధం.

కఠోపనిషత్తు అమ్మవారు అంగుష్టప్రమాణంలో ప్రతీ జీవుడి హృదయంలో ఉంటారని తెలియచేస్తూంది.

బహిఃకరణాలు లాగే జీవుడి లోపల అంతఃకరణాలు ఉంటాయి. ఇవి నాలుగు:

మనస్సు - సంకల్పవికల్పాలు చేసేది.

బుద్ధి - గ్రహ్యనిర్ణయం - గ్రహించడం. వేడి, చల్లదనం, మంచి, చెడు

అహంకారం - నేను అనే భావన ( ఇది చెడు పదం కాదు, మనం వాడుతూన్నట్లుగా )

చిత్తం - స్మృతి 

ఇవి నాలుగూ అమ్మవారి ( ఆత్మ ) అధీనంలో ఉంటాయి. అలాగని ఇవి చేసే మంచిచెడులకు అమ్మవారికి సంబంధం ఉండదు. అమ్మవారు సాక్షి మాత్రమే. ఎవరి కర్మఫలాలను వారే అనుభవిస్తారు. 

జీవుడి జన్మజన్మల కర్మఫలాల వాసనలు ఈ అంతఃకరణాలని ఆవరించుకుని ఉంటాయి. అవే మంచిచెడులను ప్రేరేపిస్తాయి. అందుకే ముక్తి పొందాలంటే ఆ వాసనల క్షయం కోసం సాధన చేస్తూ ఉండాలి. 

ఆదిశంకరులు " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు. కర్మలు ఎలా ఉండాలంటే చిత్తం శుద్ధి అయ్యేలా. దీనినే మనం తరచుగా " చిత్తశుద్ధి " అంటూంటాం. 

దీని కోసమే మనం వ్రతాలు, పూజలు, జపాలు చేసేది. వ్రతాలను ప్రత్యేక తిధులలో ప్రత్యేక సమయాలలో ప్రత్యేక ప్రదేశాలలో చేస్తూంటారు. అవి విశేష ఫలితాలనిస్తాయి. వాసన క్షయం చేస్తాయి.

" యజ్ఞానాం జప యజ్ఞో2స్మి ( భ.గీత 10:25 ) " అన్నారు పరమాత్మ గీతలో. ఓ నామాన్ని గురువు నుంచి ఉపదేశం పొంది పారాయణ చేస్తూ ఉంటే నెమ్మదిగా అయినా తప్పకుండా వాసనల క్షయం జరిగి తీరుతుంది. నాస్తి సంశయం.

ఇలా చేయగా చేయగా మనస్సు శుద్ధి అవుతుంది. చిత్తశుద్ధి కలుగుతుంది. బాహ్య/ భౌతిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. అప్పుడు ఇంద్రియాలు అంతర్ముఖులవుతాయి. అదే ఆత్మజ్ఞానం పొందడానికి మొదటి మెట్టు. 

సాధన కొనసాగిస్తే అమ్మవారి అనుగ్రహం పొందడం కష్టం కాదు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ