తాత్కాలిక సుఖాలవెంట పడకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" బ్రహ్మానందా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 676 వ నామం . 

" బ్రహ్మానందా " అంటే బ్రహ్మానందస్వరూపిణి అని భాష్యం చెప్పారు. ఈ స్థితికి మించిన ఆనందం లేదు.

కఠోపనిషత్తు మనిషికి రెండు జీవనమార్గాలు ఉంటాయని తెలియచేసింది:

" శ్రేయస్చ ప్రేయస్చ మనుష్యమేతః

  తౌ సంపరీత్య వివినక్తి ధీరః " - 1.2.2

" జీవనయానంలో మానవుని ముందు రెండు మార్గాలున్నాయి.  మొదటిది శ్రేయోమార్గం - ఇది జ్ఞాన సముపార్జన ద్వారా శ్రేయస్సు వైపుకు నడిపించి శాశ్వతానందాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తుంది.  రెండవది ప్రేయో మార్గం - ఇది ప్రియం కలుగజేసేది.  కర్మానుష్టానం ద్వారా కొంత అభ్యుదయం కలిగించినా అది అశాశ్వతము, దుఃఖ హేతువు అవుతుంది " అని.

కంచి, శృంగేరి పీఠాధిపతుల వంటివారు ముక్తిని, శాశ్వతానందాన్ని కోరుకుంటారు కనుక జ్ఞానసముపార్జనతో శ్రేయోమార్గంని అనుసరిస్తారు. సామాన్యులమయిన మనం తాత్కాలిక సుఖాలవెంట పడతాం. అంటే ప్రేయోమార్గంని అనుసరిస్తున్నాం.

నైతిక విలువలను పాటిస్తూ, శ్రేయోమార్గంలో పయనిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది.  అప్పుడు ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి మరలించి అంతర్ముఖం చేసి సాధన చేస్తే ఆత్మావలోకనం సాధ్యమవుతుంది.   అయితే ఇది అంత సులభమైనది కాదు.  కాని ఒకసారి అంతర్ముఖులవుతే వారు స్వాత్మారాములు, నిరపేక్షులు అవుతారు. వారిలో వారే ఆనందిస్తారు. అది బ్రహ్మానందంస్థితి. 

అనన్యభక్తులకు అమ్మవారు అటువంటి స్థితిని అనుగ్రహిస్తారు.

పోతనగారు భాగవతంలో ఇలా అన్నారు:

" ధీరులు నిరపేక్షులు 

  నాత్మారాములునైన మునులు 

  హరిభజనము నిష్కారణమ 

  చేయుచుందురు

  నారాయణుఁ డట్టివాఁడు నవ్య చరిత్రా‌ " 

                        - పోతనభాగవతం

ఈ బ్రహ్మానందస్థితి పొందిన వారికి అమ్మవారి ధ్యానంకి కూడా కారణమేమీ ఉండదు అన్నారు. మనం ఓ వ్రతం చేసినా, జపం చేసినా వెనుక ఓ కారణం అంటే కోరిక ఉంటుంది సహజంగానే. 

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ