తరించడానికి ఉపయోగపడే కర్మలనే చేస్తూండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ఆత్మవిద్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 583 వ నామం.

" ఆత్మవిద్యా " అంటే ఆత్మవిద్యా స్వరూపురాలు అని భాష్యం చెప్పారు. విద్యా అంటే జ్ఞానం, మంత్రం అని కూడా అర్ధం. అందుకే అమ్మవారు ఆత్మవిద్యా స్వరూపిణి.

గరుడపురాణం కర్మ విద్యల గురించి వివరిస్తూ ఇలా తెలియచేసింది:

" తత్కర్మ యన్న బంధాయ 

  సా విద్యా యా విముక్తయే " 

              - గరుడపురాణం 

" ఏ కర్మ బంధవిముక్తుడిని చేస్తుందో అది అసలు కర్మ. ఏ విద్య ముక్తిని ఇస్తుందో అది అసలు విద్య " అని. ముక్తిని అంటే జన్మరాహిత్యంని పొందాలంటే మన ఆత్మ గురించి తెలుసుకోవాలి. 

పాముని చంపాలంటే పాముని కొట్టాలి అంతేకాని పుట్టను కొడితే ప్రయోజనం ఏముంటుంది అంటుంది గరుడపురాణం. ఇక్కడ పాము ఆత్మ, పుట్ట శరీరం. ఉపవాసాలు అవీచేసి శరీరాన్ని బాధపెట్టడం ఎందుకు, ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి కాని అని భావం.

కఠోపనిషత్తు అంతా ఆత్మ గురించిన జ్ఞానమే. ఆత్మ స్వరూపం, కర్మలు, శక్తులు గురించి విస్తారంగా ప్రస్తుతించింది ఈ ఉపనిషత్తు.

మరి ఆత్మ గురించి తెలుసుకోవడం మానేసి ఎందుకు జీవులు అశాశ్వతమైన భౌతిక విషయాల వెంట పడుతున్నారు అనే దానికి ఓ అద్భుత విషయం తెలియచేసింది గరుడపురాణం:

" లోకో మోహా సురాం పీత్వా 

  న విభేతి కదాచన "  - గరుడపురాణం

మోహం అనే సుర ( సారాయి )ని త్రాగేసారుట జీవులు. త్రాగిన వాడికి చుట్టూ ఏమి జరుగుతూందో తెలియదు కదా. అలాగే మోహం అనే సురను త్రాగిన జీవులకు ఏది శాశ్వతమో, ఏది మాయో తెలియడం లేదు. మొదట ఈ మోహం లోంచి బయట పడడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి. అది అంత సులభం కాదు.

నిర్గుణభక్తితో తనను సేవించేవారికి ఆత్మజ్ఞానంని ప్రసాదించి వారిని తనలో ఐక్యం చేసుకుంటారు అమ్మవారు అని దేవీభాగవతం తెలియచేస్తూంది. నిర్గుణభక్తి అలవడాలంటే సాత్వికభక్తి సాధన చేయాలి. పూజలు చేయడం, నామ పారాయణం చేయడం, పుణ్యకార్యాలు చేయడం లాంటివన్నీ సాత్వికభక్తి.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరికీ సాత్వికభక్తిని అనుగ్రహించమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ