అమ్మవారికి రాగద్వేషాలు ఎందుకుంటాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" దోషవర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 195 వ నామం .

" దోషవర్జితా " అంటే రాగద్వేషాది దోషములు లేనిది అని భాష్యం చెప్పారు.

రాగం అంటే మమకారం. రాగం, ద్వేషం దోషాలు. ఇవి అమ్మవారికి ఎందుకుంటాయి. అమ్మవారు " పద్మపత్రమివాంభసా " - తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారు. జీవులమీద అమ్మవారికి మమకారమూ ఉండదు, ద్వేషమూ ఉండదు. వారి వారి కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తూ ఉంటారు.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" ఇంద్రియస్యేంద్రియస్యార్ధే    

  రాగద్వేషౌ వ్యవస్థితౌ, 

  తయోర్న వశమాగచ్ఛేత్      

  తౌ హ్యస్య పరిపంధినౌ "

             - భ.గీత 3:34

" ప్రతి ఇంద్రియార్ధము నందును ( ప్రతి ఇంద్రియ విషయమునందును ) రాగద్వేషములుదాగియున్నవి. మనుష్యుడు ఈ రెండింటికిని వశము కాకూడదు.  ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు. మహాశత్రువులు " అని. 

ఇక్కడ ఇంద్రియార్ధము అంటే ఫలితం అని. 

కుంతీదేవి మహాపతివ్రత. రాగద్వేషాలను రెండింటినీ వదిలేసింది.

కృష్ణుడు కుంతీదేవిని " అత్తా ఇంతవరకూ ఎన్నో కష్టాలు పడ్డావు. ఏదయినా చక్కటి వరం కోరుకో, తీరుస్తాను " అంటారు. కుంతి " మా వంశమునందు కాని, నా సంతానమునందు కాని మమకారంలేకుండా చెయ్యి. ఈ ' నా ' అనేది భయంకరమైనది. పునర్జన్మ హేతువు " అంటుంది. 

పాండవులు కౌరవులవల్ల ఎన్నో బాధలు పడినా, అవమానింపబడినా కుంతికి ధృతరాష్ట్రుడి మీదకాని, గాంధారి మీదకాని ద్వేషం లేదు. కురుక్షేత్రయుద్ధంలో దుర్యోధనాదులు మరణించిన తరువాత ధర్మరాజు చక్రవర్తి అవుతాడు. అప్పుడు కుంతి రాజమాతగా వారితో ఉండి అన్ని సుఖాలు అనుభవించవచ్చు. కాని కుంతి అలా చేయలేదు. ధృతరాష్ట్రుడు, గాంధరీలతో వానప్రస్థానికి వెళ్ళి వారికి సేవ చేసింది. అంతటి అద్భుత వ్యక్తిత్వం.

ఇటువంటి రాగద్వేషాలు లేని స్థితిని తన భక్తులకు అమ్మవారు అనుగ్రహిస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ