అమ్మవారి రూపం ఊహింపశక్యమా? - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" అచింత్యరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 554 వ నామం.
" అచింత్యరూపా " అంటే ఊహింపశక్యము కాని రూపము గలది అని భాష్యం చెప్పారు.
తైత్తిరీయోపనిషత్తు ఇలా తెలియచేస్తూంది:
"యతో వా ఇమాని భూతాని
జాయంతే యేన జాతాని జీవంతి,
యత్ప్రయంతి అభిసంవిశంతి,
తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి"
- తైత్తిరీయోపనిషత్తు
" దేని నుంచి ఈ భూతకోటి పుడుతున్నదో, దేనివలన పుట్టిన భూతకోటి జీవిస్తున్నదో అంత్యమున దేనిలో లీనమవుతున్నదో దానిని తెలుసుకొనుటకు ప్రయత్నించు. అది బ్రహ్మ అని " అని.
మన ఆత్మలు అంటే జీవుల ఆత్మలన్నీ అమ్మవారి అంశలే.
కఠోపనిషత్తు ఆత్మని ఇలా వర్ణించింది:
" అణోరణీయాన్మహతో
మహీయాన్ " - 1.2.20
" చాలా చిన్న దాని కంటే చిన్నది, చాలా పెద్ద దాని కంటే పెద్దది " అని. ఆత్మ సర్వవ్యాపకమైన తత్త్వం అని దీని అర్థం. అంటే శరీరమంతా వ్యాపించి ఉండి అన్ని ఇంద్రియములచేత పని చేయిస్తూంది.
మన ఆత్మస్వరూపాన్నే ఎవరూ ఊహించలేకపోతున్నారంటే అమ్మవారి రూపం ఊహకెలా అందుతుంది. అమ్మవారు విశ్వమంతా వ్యాపించినవారు.
అందుకే పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం
ఆశ్చర్యవద్వదతి తధైవ చాన్యః,
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ "
- భ.గీత 2:29
" ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ( ఈ ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేఱొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైనదానినిగా వినును. ఆ విన్నవారిలోకూడ కొందరు దీనినిగూర్చి ఏమియు ఎఱుగరు " అని.
అమ్మవారి రూపం ఊహింపశక్యము కానిది.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment