కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి జయంతి నేడు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
ఒకరోజు కంచి పరమాచార్యులవద్దకు ఓ భక్తుడు వచ్చాడు. దైవభక్తి మెండుగా ఉన్నవాడు, పరమాచార్యులంటే భక్తి గౌరవం ఉన్నవాడు.
భక్తుడు అన్నాడు " స్వామీ ఎప్పుడు కళ్ళుమూసుకుని అమ్మవారిని తలచుకున్నా ఓ ప్రముఖ ' నటి ' మొహం గుర్తుకొస్తూంది, ఏమి చెయ్యడం " అని.
స్వామి అన్నారు " మొహం ఎందుకు గుర్తుచేసుకోవడం, నువ్వు పట్టుకోవలసినవి, కోరుకోవలసినవి అమ్మవారి పాదాలు, అందుకని పాదాలు గుర్తుచేసుకో " అని.
అమ్మవారి పాదాలు అగ్నివర్ణంలో ఉంటాయి. పసుపువ్రాసి, పారాణి అలంకరించి ఉంటాయి. కాలికి పట్టీలు , వేళ్ళకు మెట్టెలు. ఇంద్రాది దేవతలు అమ్మవారి పాదాల వద్ద కూర్చుని ఉంటారు. ఆ ఊహే అద్భుతం.
శంకరులు శివానందలహరి గానం చేస్తూ ఇలా అంటారు :
" సదా మోహాటవ్యాం చరతి
యువతీనాం కుచగిరౌ,
నటత్యాశాశాఖా స్వటతి
ఝడితి స్వైర మఖికః,
కపాలిన్ భిక్షో మే హృదయకపి
మత్యంత చపలం ,
ధృఢం భక్త్వా బద్ధ్వా శివ
భవదధీనం కురు విభో " .
" ఓ ఈశ్వరా - నా హృదయం ( మనస్సు ) మోహం అనే అడవిలో తిరుగుతూంది. నా మాట వినడం లేదు. అతి చపలమైన నా మనస్సనే కోతిని దయచేసి నా భక్తి ( అనే తాడు ) తో కట్టి నీ అధీనంలో ఉంచుకో స్వామీ " అని.
ఇక సామాన్యమానవుల గురించి చెప్పాలా. అందుకే గీతలో స్వామి చక్కటి మార్గాన్ని సూచించారు. నాసికాగ్రాన్ని చూడమంటే రెండు కళ్ళతో అని కాదు. కళ్ళుమూసుకుని అంతర్దృష్టిని ఎవరి ముక్కుచివరన వారిని నిలుపమని.
అప్పుడు మనస్సు కొంచెం కుదురుకుంటుంది.
ఈరోజు శ్రీకంచిపరమాచార్యుల జయంతి. కారణజన్ములు. శుభాకాంక్షలు అందరికీ.
" అపారకరుణా సింధుం
జ్ఞానదం శాంతరూపిణం,
శ్రీ చంద్రశేఖర గురుం
ప్రణమామి ముదావహం "
ఏతత్ సర్వం శ్రీకంచికామాక్షీదేవ్యార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment