అమ్మవారు అవసరమయితే చాలా కఠినంగా కూడా ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" వైఖరీరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 371 వ నామం .
" వైఖరీరూపా " అంటే మిక్కిలి కఠినమైన రూపము గలది. అమ్మవారి హృదయం, మాట, చూపు అన్నీ కరుణతో నిండి ఉంటాయి సాధారణంగా. అవసరమయితే చాలా కఠినంగా కూడా ఉంటారు.
ప్రతీ తల్లికీ బిడ్డలంటే అమిత ప్రేమ. అలా అని పిల్లవాడు తప్పు చేస్తూన్నా, పాడయి పోతూన్నా మెత్తగా ఉండదు. కోపగిస్తుంది, అవసరమయితే వీపుమీద నాలుగు తగిలిస్తుంది. లేకపోతే భవిష్యత్తులో ఆ పిల్లవాడు కుటుంబానికి, సమాజానికి శాపమవుతాడు.
జడ భరతుడు కఠినసాధనతో ముక్తికి చేరువయి కూడా జింక పిల్ల బంధంలో కూరుకుపోయి తదుపరి జన్మలో జింకపిల్లగా పుట్టాడు. తరువాత జన్మలో ఓ సాంప్రదాయ కుటుంబంలో పుట్టినా దేనిని పట్టించుకోకుండా అవధూతలా ఉండేవాడు. మహాజ్ఞాని. ముక్తికోసం ఎదురు చూస్తూ జీవితం గడుపుతున్నాడు. ఓ రోజు పొలంగట్టుమీద కూర్చుని ఉండగా కొందరు ఆటవికులు అమ్మవారికి బలి ఇవ్వడానికి తీసుకుని పోతారు. ఇతను ఏమీ పట్టించుకోనే లేదు.
ఇటువంటి అవధూత, మహాజ్ఞానిని బలి ఇస్తూంటే అమ్మవారు సంతోషిస్తారా. బలి ఇచ్చే సమయంలో ప్రత్యక్షమై అక్కడ ఉన్న అందరినీ నరికేసారు. జడ భరతుడు ఇవేమీ తనకు సంబంధంలేని విషయంగా భావించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
ప్రకృతిని పాడుచేస్తూన్నా, హాని కలిగించేలా ప్రవర్తించినా అమ్మవారు చూస్తూ ఊరుకోరు. భూకంపాలు, సునామీలూ వచ్చినప్పుడు పరిస్థితి చూస్తుంటాం. ఆ చిత్రాలు చూస్తేనే వళ్ళు గగుర్పొడుస్తుంది. ప్రళయకాలంలో అమ్మవారి రూపాన్ని ఊహించుకుంటేనే భయమేస్తుంది.
" ధర్మో రక్షతి రక్షితః,
ధర్మ హింసా తథైవ చ "
అమ్మవారు అవ్యాజకరుణామూర్తియే కాదు చండిక కూడా. జాగ్రత్తగా ఉండాలి.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment