హనుమజ్జయంతి శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

" అష్టసిద్ధ నవనిధికే దాత 

  అసవరదీన్హ జానకీమాత "

" ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తిని సీతమ్మ నీకు వరంగా ఇచ్చినది స్వామి " అని ప్రార్ధిస్తాం హనుమని.

అటువంటి అద్భుత వరం ఎందుకు ఇచ్చారో సీతమ్మ చూద్దాం.

సీతమ్మ హనుమతో " రాముడు తన సైన్యంతో ఇన్ని యోజనాల సముద్రాన్ని దాటి ఇక్కడకు రావడం, రావణుడిని చంపడం అనే విషయం నాకు నమ్మశక్యంగా లేదు " అంటారు నిస్పృహతో. కొన్ని నెలలుగా పరాయి దేశంలో క్రూరులైన రాక్షసుల మధ్య బందీగా ఉన్న స్త్రీకి ధైర్యం చెప్పడం, నమ్మకం కలిగించడం చిన్న విషయం కాదు. ఒక్క మాటతో హనుమ సీతమ్మను నమ్మించి, ఆవిడ ముఖంలో చిరునవ్వు తెప్పించారు.

హనుమ అంటారు సీతమ్మతో:

" మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ 

  సంతి తత్ర వనౌకసః

  మత్తః ప్రత్యవరః 

  కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ 

          - (సుందరకాండ) 5:39:38

" నా కంటే గొప్పవారు, మరియు నాకు సమానమైన వారు వేలమంది వానరులు ఉన్నారు సుగ్రీవుని సైన్యంలో " అంటారు హనుమ. నాకన్నా తక్కువ శక్తిమంతులు ఎవరూ లేరక్కడ అని అర్ధం. మరి నేనే రాగలిగానంటే వారందరూ రావడానికి కష్టమేమిటమ్మా. 

హనుమ విరాట్ రూపాన్ని చూసాక సీతమ్మకు నమ్మకం, సంతోషం కలిగింది.

హనుమ " జ్ఞానినాం అగ్రగణ్యం ". రాముడు మొదటిసారి హనుమ మాటలు వినగానే లక్ష్మణుడితో ఇలా అంటారు: 

" నాన్ ఋగ్వేద వినీతస్య, 

  నా యజుర్వేద ధారిణిః, 

  న సామవే విదుషః , 

  శక్యమేవం ప్రభాషితం "

" ఋగ్వేదంలో శిక్షణ లేనివారు, యజుర్వేదంలో ధారణ లేనివారు, సామవేదంలో పాండిత్యం లేనివారు ఇలా మంగళకరంగా హృదయానికి హత్తుకునేలా మాట్లాడలేరు " అని.

ఆ సమయంలోనే రాముడు " ఇటువంటి దూత ఎవరికి లభిస్తాడో అతని పనులన్నీ చక్కగా నెరవేరుతాయి " అని అంటారు లక్ష్మణుడితో. రాముడు అభిప్రాయపడినట్లుగానే హనుమ రామదూత గా లంకకు వెళ్ళడమే కాకుండా, రామకార్యంని నెరవేర్చి" రామదూత " అనే అద్భుత నామం పొందారు.

శ్రీరాముడు జగదానందకారకుడు. అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు. అటువంటి రాముడికి సీతమ్మ జాడ తెలియచేసి ఆనందాన్ని కలిగించారు హనుమ. 

" సంజీవపర్వతోద్ధారా 

  మనోదుఃఖం నివారయా, 

  ప్రసీద సుమహాబాహో 

  త్రాయత్వ హరిసత్తమా "

ఇది హనుమ ధ్యాన శ్లోకం. మానసికరోగాలు దుఃఖం పోవడానికి ఈ మంత్రపఠనం/జపం చేయమంటారు గురువులు.

ఈరోజు హనుమ జయంతి. శుభాకాంక్షలు అందరికీ.

ఏతత్ సర్వం శ్రీహనుమదార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ