హృదయం దగ్గర ఉన్న విష్ణుముడి విడడానికి 12 ఏళ్ళు పడుతుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" విష్ణుగ్రంధివిభేదినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 102 వ నామం.
" విష్ణుగ్రంధివిభేదినీ " అంటే విష్ణుముడిని తొలగించేవారు అని భాష్యం చెప్పారు.
ఈ ముడిలో విష్ణువు ఉండడంవల్ల విష్ణుముడి అని పేరు. ఇది మణిపూరచక్రానికి పైన అనాహతచక్రానికి క్రింద ఒక ముడి, అనాహతచక్రానికి పైన ఒక ముడి ఉంటాయి. ఈ రెండు ముడులను కలిపి విష్ణుగ్రంధి అంటారు. ఈ గ్రంధిలో ఉన్న రెండుచక్రాలు అగ్ని సూర్య చక్రాలు. తేజోమయం. అగ్ని తత్త్వం.
చక్కని గురువు తోడ్పాటుతో కఠిన సాధన చేస్తే మణిపూరచక్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టిన తరువాత విష్ణుముడిని తొలగించుకోవడానికి ఆరు సంవత్సరములు పడుతుందని సాధకులు అనుభవంతో తెలియచేసారు.
అనాహతచక్రం హృదయస్థానంలో వాయుతత్త్వంతో కూడుకుని ఉంటుంది. అధిష్టానదేవత రాకిన్యాంబ. 12 దళాల హేమవర్ణ కమలంలో ఆశీనురాలయి ఉంటారు.
అనాహత అంటే గాయపడని, కొట్టబడని, లేదా ఓడిపోని అని అర్థం. ఇది ప్రేమ, కరుణ, సానుభూతి, సమతుల్యత, ప్రశాంతతలకు కేంద్రంగా ఉంటుంది.
విష్ణుముడి విడనంతకాలం ద్వేషం, శత్రుత్వం, దురాశలు పట్టి పీడిస్తూ ఉంటాయి. హృదయమంతా విష్ణువు నిండి ఉంటారు కనుక ఈ దశలో సాధకుడు తనే విష్ణువుగా భావించాలి. అలా సాధన కొనసాగిస్తే విష్ణుముడి విడిపోయి ప్రయాణం పైకి సాగుతుంది. విష్ణుముడి విడితే విష్ణుమాయ అంటే విషయలాలసలు తొలగుతాయి.
విష్ణుముడి విడివడిన తరువాత ఈ వాయువులు ఇడ పింగళ నాడుల ద్వారా ఆజ్ఞాచక్రానికి అంటే రుద్రగ్రంధికి చేరుకుంటాయి.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీవారాహీదేవీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment