భూదేవిని జాగ్రత్తగా చూసుకుంటే అన్నీ సమకూరుస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ధరా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 955 వ నామం .
" ధరా " అంటే పృథివీ స్వరూపురాలు. అంటే భూమి. భూమికి అత్యంత గౌరవాన్నిచ్చింది సనాతనధర్మం. ఏది కావాలన్నా భూమి నుంచే రావాలి. ఆహారము, నీరు, ఔషధాలు, లోహాలు, ఇంధనాలు ఏవి చూసినా భూమినుంచే వస్తాయి. మనుగడకు అవసరమైనవి అన్నీ భూమే ఇస్తూంది. అటువంటి భూమిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. సనాతనధర్మం భూమిని దేవతగా కొలవమంది.
అథర్వవేదంలో " భూమి సూక్తం" ఉంది. అందులో ఇలా కీర్తిస్తారు:
" సత్యం బృహత్రితముగ్రం
దీక్షా తపో బ్రహ్మ యజ్ఞః
పృథివీం ధారయంతి,
సా నో భూతస్య భవ్యస్య
పత్న్యురుం లోకం
పృథివీ నః కృణోతు "
ఉత్కృష్టమైన సత్యం, చెక్కుచెదరని నిజాయితీ, పవిత్రత, తపస్సు, సచ్ఛీలజీవితం ద్వారా సంక్రమించే శక్తి, యజ్ఞం - ఇవే ఈ భూమిని భరిస్తున్నాయి అని. అంటే భూమి కలకాలం చక్కగా అలా నిలిచి ఉండాలంటే ఎన్ని సుగుణాలు ఉండాలి మనుషులకు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అన్నది అందరికీ తెలిసినదే.
ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మి గారిని ఐక్యరాజ్యసమితివారు ఆహ్వానించారు సన్మానం చేయడానికి. ఆవిడ కంచి వెళ్ళి పరమాచార్యులవారికి విషయం చెప్పి ఆశీర్వదించమన్నారు. ఆయన శుభం అని ఆశువుగా ఓ కీర్తన " మైత్రీం భజత అఖిలహృజ్జేత్రీం....." వ్రాసి ఇచ్చారు అక్కడ పాడమని. ఆ కీర్తనలో ఇలా ఉంది:
" జననీ పృథివీ కామదుఘా22స్తే........"
అంటే " తల్లి భూదేవి మనకు కావలసినవి అన్నీ ఇస్తుంది కామధేనువులా " అని అర్దం. సభికులు పులకించిపోయారు.
గోవు పాలు ఇవ్వాలంటే మనం ఏమి చేయాలి. దాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. చక్కటి తిండి పెట్టి చక్కటి వాతావరణంలో ఉంచాలి. అప్పుడు ఆ ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది.
మరి ఇన్ని ఇస్తూన్న భూమాతను ఎలా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అరగంట కార్యక్రమం కోసం ఏళ్ళ వయస్సున్న చెట్లను కొట్టేయడం, అతిథిగృహాలకోసం కొండలను త్రవ్వేయడం, నదులలోకీ విషపూరితమైన వ్యర్ధాలు వదిలేయడం, సరైన సంరక్షణ చేయకుండా భూగర్భంలోని ఖనిజాలను త్రవ్వేయడం లాంటి పనికిమాలిన పనులు చేస్తే ప్రకృతి ఏమి చేయాలి?. అదే చేస్తూంది, చేస్తుంది. అనుమానం అక్కరలేదు.
ఇప్పటికయినా జాగ్రత్త పడకపోతే కష్టమే.
" ధర్మ ఏవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః "
- తస్మాత్ జాగ్రత.
అమ్మవారు " ధర " ని చల్లగా చూడమని అందరం వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment