ప్రభావధర్మాన్ని అనుసరించడం అలవాటు చేసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" స్వభావమధురా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 915 వ నామం.
మధురం అంటే తేనె. అమ్మవారి స్వభావం తేనెలా తియ్యగా ఉంటుంది. అమ్మవారికి లేనిదిలేదు, పొందవలసినది లేదు, ఇవ్వలేనిదిలేదు. ఆవిడ స్వభావం మధురంగా ఉండక వేరేలా ఎలా ఉంటుంది.
పూజ్యులు గరికిపాటివారు తరచూ అంటూంటారు " అసలు అమ్మవారికి జీవులమీద కోపం ఎందుకు ఉంటుందండి " అని.
ధర్మపాలన మూడు రకాలుగా ఉంటుంది అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు.
మొదటిది స్వభావధర్మం. కొందరికి ఎవరూ చెప్పనక్కరలేదు. స్వతహాగానే ధర్మపాలన చేస్తూంటారు. రాముడు, ధర్మరాజు లాంటివారు ఆ కోవలోకి వస్తారు. రాముడిని ఒక రాక్షసుడు " రామో విగ్రహవాన్ ధర్మః " అని కొనియాడాడు. అంతటి ధర్మమూర్తి. " ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావ " - " ధర్మంగా ఉండడం నా స్వభావం మరి, ఏమి చేయమంటావు " అంటారు ధర్మరాజు ద్రౌపదితో.
ఇక రెండవరకం " ప్రభావధర్మం " - చెప్పగా చెప్పగా సాధన చేస్తూ ఉంటే అలవడుతుంది. ఇదే ఈకాలంలో ఎక్కువగా పొందగలిగినది/పొందవలసినది. సనాతనధర్మ పరిరక్షణకోసం, సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యగా చెయ్యగా అలా మంచిచెయ్యడమే అలవాటుగా అయిపోతుంది. " అభ్యాసం కూసు విద్య " అన్నారు. చిన్నపిల్లలకు బాల్యంనుంచే ఇలా చెయ్యడం అలవాటు చేస్తే బాధ్యతగల పౌరులుగా తయారవుతారు.
ఇక మూడవది " అభావధర్మం " - ఇది దుర్మార్గులు, మూర్ఖులు చేసేది. వారుచేసే పనులు వారికి తప్ప ఎవరికీ ఏవిధంగానూ ఉపయోగపడవు. పైగా వీరిపనులు ఇతరులకు, సమాజానికి చేటు చేస్తాయి. ఇటువంటివారు ఈకాలంలో ఎక్కువగానే కనబడుతూంటారు.
" ధర్మో రక్షతి రక్షితః " - ధర్మాన్ని రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది.
ప్రభావధర్మంని అలవాటుగా చేసుకోవడం కష్టంకాదు కనుక ఆ మార్గంలో ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి అందరూ. అప్పుడు అందరి స్వభావం కూడా మధురంగా ఉంటుంది. ప్రపంచశాంతికి మార్గం సుగమం అవుతుంది. అమ్మవారు ఆనందిస్తారు.
సర్వేజనాః సుఖినో భవంతు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment