మన శరీరం ఒక క్షేత్రం, అంటే పొలం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" క్షేత్రస్వరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 341 వ నామం.
" క్షేత్రస్వరూపా " అంటే క్షేత్ర స్వరూపురాలు.
క్షేత్రం అంటే ఏమిటి?.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" ఇదం శరీరం కౌన్తేయ
క్షేత్రమిత్యభిధీయతే ।
ఏతద్యో వేత్తి తం ప్రాహుః
క్షేత్రజ్ఞ ఇతి తద్విదః "
- భ.గీత 13:2
" ఈ దేహము క్షేత్రము అని, మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని - ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది " అని.
మన శరీరం క్షేత్రం అన్నారు. క్షేత్రం అంటే పొలం. అంటే మన శరీరం ఒక పొలం. పొలంలో పంటలు కదా పండుతాయి. మరి శరీరానికి విత్తనం ఏది. మనం చేసే కర్మే విత్తనం. మంచి కర్మ అయితే మంచి పంట, చెడు అయితే చెడు పంట.
అమ్మవారు క్షేత్ర/శరీర స్వరూపురాలు ఎలా. శరీరమంతా వ్యాపించిన అమ్మవారి చైతన్యం వలననే మన ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. మరణించిన తరువాత కూడా అదే శరీరం అక్కడే ఉంటూంది కదా. ఈ శరీరానికి అధిపతి అమ్మవారు. అమ్మవారు ( చైతన్యం ) ఉంటే జీవం, తొలగుతే మరణం. అందుకే అమ్మవారు క్షేత్రస్వరూపురాలు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment