అమ్మవారు శివుడు ఒకరే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శివమూర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 407 వ నామం.
" శివమూర్తిః " అంటే శివుడే స్వరూపంముగా గలది అని భాష్యం చెప్పారు.
శివుడు, అమ్మవారు ఒకరే. అర్ధనారీశ్వరుడు.
బ్రహ్మగారిని సృష్టి చేయమంటే ఆయనకు ఎలాగో తెలియలేదు. నిరంతరం జీవులు పుడుతూ ఉండడం ఎలా అని. రుద్రుడిని ధ్యానం చేసారు. అప్పుడు రుద్రుడు అర్ధనారీశ్వరుడిగా దర్శనం ఇచ్చారు. స్త్రీపురుషులను సృష్టించాలని తెలుసుకున్నారు బ్రహ్మ.
రఘువంశకావ్యం రచిస్తూ మహాకవి కాళిదాసు ఇలా స్తుతించారు:
" వాగర్థావివ సంపృక్తౌ
వాగర్థ ప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే
పార్వతీపరమేశ్వరౌ " 1-1
పార్వతీపరమేశ్వరులు " వాక్ + అర్ధం " లా ఉన్నారుట. నోటి వెంట మాట వస్తే అర్ధం లేకుండా ఉండదు. అవి వేరు వేరు కాదు, రెండూ ఒకటే అని.
భృంగి మహర్షి శివుని పరమభక్తుడు. శివుడిని తప్ప ఎవరినీ పూజించేవాడు కాదు. ఓసారి కైలాసం వెళ్ళి శివుడికి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు. శివుడి ప్రక్కనే అమ్మవారు ఉన్నా శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేస్తూ శివపార్వతుల మధ్యనుంచి వెడుతున్నాడు. అమ్మవారు శివునిలో కలిసిపోయి అర్ధనారీశ్వరుడుగా అయింది. అయినా భృంగి భ్రమరరూపం దాల్చి ఇద్దరి మధ్యనుంచి రంధ్రం చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూంటే అమ్మవారు కోపగించి నీకు నా అవసరం లేదు కనుక శక్తిహీనుడవు అయిపో అని శపించింది. రక్తమాంసాలు పోయాయి. ఎముకల గూడు మిగిలింది. నుంచోవడానికి కూడా వీలు కాకపోవడంతో శివుడు మహర్షికి మూడవ కాలు అనుగ్రహించారు.
ఇక్కడ అర్ధం చేసుకోవాలసినది మన శరీరం శివుడు, లోపల రక్తమాంసాలు శక్తి అంటే అమ్మవారు. రెండూ కలిసి ఉంటేనే జీవుడు.
అమ్మవారు శివస్వరూపురాలు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment