శాంతమూ లేక సౌఖ్యము లేదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శివంకరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 408 వ నామం.
" శివంకరీ " అంటే భక్తులకు మంగళకరమైన బ్రహ్మత్వమును కలిగించునది అని భాష్యం చెప్పారు. బ్రహ్మత్వము అంటే ముక్తి, జన్మరాహిత్యం. తనలో లీనం చేసేసుకుంటారు.
శివం అంటే మంగళకరము. భక్తులకు అన్ని శుభాలను కలిగిస్తుంది తల్లి. మంచి ఆలోచనలు చేస్తూ, మంచి పనులు చేస్తూ ఉంటే చాలు తల్లి శిశువును చూసుకున్నట్లుగా అన్ని సౌకర్యాలను కలిగిస్తూ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
వామన పురాణం/యోగవాశిష్టంలో శివుని తెలుసుకోవడం ఎలా అన్నది తెలియచేయబడింది. " చిన్మాత్రం అమలం శాంతం " - నిర్మలమయిన జ్ఞానమయమయిన శాంతమే శివుడు అని. నిర్మలము, శాంతము అయిన మనస్సుతో సదా భగవధ్యానంతో జీవితాన్ని గడిపే జీవుడిని శివునిగా చేస్తారు అమ్మవారు. సందేహం అక్కరలేదు.
విష్ణుసహస్రనామాలలో " అక్షరః " అని ఒక నామం. నాశనము లేని వాడు అని భాష్యం. మనం నాశనమయిపోయే ఈ శరీరం, ధనం, ఇతర వస్తువుల మీదే దృష్టి పెడతాం, నాశనం అయిపోతున్నాం. అదే నాశనము లేని పరమాత్మ మీద దృష్టి పెడితే మోక్షమే. తిరిగి జననమరణచక్రం ఉండదు.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ,
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స
తం పరం పురుషముపైతి దివ్యం "
- భ.గీత 8:10
" పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భ్రుకుటీమధ్యమున ప్రాణములను స్థిరముగానిల్పి,
నిశ్చలమైనమనస్సుతో స్మరించుచు దివ్యస్వరూపుడును, పరమపురుషుడును అయిన పరమాత్మనే చేరును " అని.
ఆదిశంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం గానం చేస్తూ " కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి - చెడు కొడుకు ఉంటాడేమో కాని చెడు తల్లి ఉండదు కదమ్మా " అన్నారు. ఎంత అద్భుత విషయం. అమ్మవారు ఎప్పుడూ మనకు శుభాలనే అనుగ్రహిస్తారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment