దూత/రాయబారికి ఉత్తమ లక్షణాలు ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" శివదూతీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 405 వ నామం.

" శివదూతీ " అంటే శివుని దూతగా కలిగినవారు అమ్మవారు అని భాష్యం చెప్పారు.

ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కాని ఇది ఒక అద్భుతమయిన విషయం. దూత సామాన్యమయిన వారు కాదు. సకల సద్గుణాలు, సమస్త జ్ఞానం ఉండాలి. ఎవరు దూతగా పంపిస్తున్నారో వారి మనస్సును, మనస్సులోని మర్మాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని ఉండాలి దూత. వెళ్ళిన పనిని సజావుగా పూర్తి చేసుకుని రావాలి. పని సానుకూలంగా అవడానికి అవసరమయితే సామ దానాలతో పాటు భేద దండోపాయాలు కూడా ఉపయోగించాలి.

శ్రీరాముడు మొదటిసారి హనుమను కలిసినప్పుడు హనుమ మాటతీరుకు ఆశ్చర్యపోయి లక్ష్మణునితో ఇలా అంటారు: 

" ఏవం గుణ గణైర్ యుక్తా 

  యస్య స్యుః కార్య సాధకాః,

  తస్య సిద్ధ్యంతి సర్వేఽర్థా 

  దూత వాక్య ప్రచోదితాః " 

     - రామాయణం - 4:3:35

" ఎవరికైతే ఇలాంటి సకల సద్గుణాలు కలిగిన కార్యసాధకులు దూతలుగా ఉంటారో వారి పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి " అని.  అంటే అప్పుడే శ్రీరాముడు హనుమను సీతాన్వేషణకు దూతగా పంపాలని నిర్ణయించుకున్నారు అని అర్థం అవుతూంది.

శ్రీకృష్ణుడిని దూతగా వెళ్ళమని ప్రార్ధించారు పాండవులు. పరమాత్మ కన్నా విశిష్టమయిన దూత ఎవరు దొరుకుతారు వారికి ఆ సమయంలో. రాయబారానికి వెళ్ళేముందు శ్రీకృష్ణుడు అందరితోనూ ఆఖరికి ద్రౌపదితో కూడా మాట్లాడి వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పరమాత్మకు తెలియకనా ఏమి చేయాలో. కాని అది దూత లక్షణం. 

ధృతరాష్ట్రుడు పాండవుల ప్రణాళికలను తెలుసుకోవడానికి పాండవులు కూడా అభిమానించే సంజయుడిని దూతగా పంపించాడు. 

కంసుడు బలరామకృష్ణులను సంహరించడానికని ఏర్పాట్లు చేసుకుని వారిని ఆహ్వానించి మథురకు తీసుకురావడానికి కృష్ణుడి అనన్యభక్తుడు అయిన అక్రూరుడిని దూతగా పంపాడు. 

దూతను బంధించకూడదు, సంహరించకూడదు అని తెలియచేస్తూంది సనాతనధర్మం. వెళ్ళిన పని సందర్భంగా ఏమి జరిగిందో మళ్ళీ దూతను పంపిన వారికి తెలియాలి కదా. ఎంత ఉత్కృష్టమైనది మన ధర్మం.

ఒంటి చేత్తో సృష్టి కార్యాన్నంతటినీ నిర్వహిస్తూన్న అమ్మవారికి తన కార్యనిర్వహణకు సాధకుడుగా, దూతగా తన భర్త శివుడి కన్నా విశిష్టమయిన వారు ఎవరు దొరుకుతారు.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ