అమ్మవారు అంటే శివునికి అమిత ప్రేమ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శివప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 409 వ నామం.
" శివప్రియా " అంటే శివునికి ఇష్టురాలు అని భాష్యం చెప్పారు.
అమ్మవారిని శివుడు ఎందుకు ఇష్టపడరు. ఆయన్ని వివాహం చేసుకోవడానికి ఎంత కఠిన సాధన చేసారు అమ్మవారు. ఆయన తపస్సు చేసుకుంటూంటే సపర్యలు చేసారు. ఆయన కన్నెత్తి కూడా చూడకపోతే మండుటెండలో మంటల మధ్య నుంచుని, గడ్డకట్టే చలిలో చల్లటినీటిలో కంఠం దాకా మునిగి మరీ తపస్సు చేసారు. నిరాహారంగా అంటే ఆఖరికి ఆకులు కూడా తినకుండా తపస్సు చేసి " అపర్ణ " అని కీర్తించబడ్డారు.
క్షీరసాగరమథనం సమయంలో పుట్టుకొచ్చిన గరళాన్ని లోకకళ్యాణం కోసం తాను త్రాగక తప్పదు అని శివుడంటే సరే కానివ్వండి అన్నారు అమ్మవారు. అందరికీ శుభాలను అనుగ్రహించే అమ్మవారికి ఆవిడ మాంగళ్యం మీద అంత నమ్మకం మరి.
ఏనుగుచర్మం కట్టుకుని, శరీరమంతా బూడిద పూసుకుని, మెడలో పాములు వేసుకుని, పుర్రె చేతిలో పట్టుకుని శ్మశానాలలో తిరుగుతూన్నా శివుడే నా అర్ధశరీరం అన్నారు అమ్మవారు.
అలాంటి అమ్మవారిని ఇష్టపడకుండా ఎలా ఉంటారు, ఉండగలరు శివుడు.
కంచిపరమాచార్యులకు 103 డిగ్రీల జ్వరం ఓరోజు. మగతగా కూర్చుని ఉన్నారు. శిష్యుడు వచ్చి వైద్యులు వస్తున్నారు అంటే ఎందుకు అన్నారు. మీకు జ్వరంగా ఉంది, చూసి మందు ఇవ్వడానికి అన్నాడు. జ్వరం ఎంతుంది అన్నారు స్వామి. 103 పైనే ఉంది అన్నాడు శిష్యుడు. సమయం ఎంతయింది అని అడిగితే 11.30 అయింది అన్నాడు శిష్యుడు. బయట ఎండ ఎలా ఉంది అన్నారు. మాడిపోతూంది అన్నాడు. అలాగా, అయితే స్నానంకి ఏర్పాటుచెయ్యి వెంటనే అన్నారు. 11.30 గంటలే అయింది అన్నాడు శిష్యుడు. " సరిపోతుంది " అన్నారు.
పరమాచార్య " అమ్మవారు శివుడిని వివాహం చేసుకోవడానికి మంచి ఎండాకాలంలో మంటలమధ్యలో నిలబడి తపస్సు చేసారు. అంత వేడిమిలో అలా ఎలా చేసింది ఆ తల్లి అని తలచుకున్నప్పుడల్లా బాధగానూ ఆశ్చర్యంగానూ ఉండేది. ఈరోజు ఈ వేడి శరీరంతో మండుటెండలో కూర్చుని ఆ తల్లి కామాక్షీదేవిని ధ్యానంచేసే అవకాశం ఇన్నాళ్ళకు వచ్చింది నాకు " అని చెప్పి సంతోషంతో స్నానం చేసి 12 గం.లకు ఎండలో బయట కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు.
అమ్మవారికి అమ్మవారి భక్తులకే సాధ్యం అటువంటి సాధన.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment