అమ్మవారు తనను ఇష్టపడేవారిని ఎక్కువగా ఇష్టపడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" శిష్టేష్టా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 411 వ నామం.

" శిష్టేష్టా " అంటే శిష్టులను అంటే మంచివారిని ఇష్టపడుతారు అమ్మవారు అని భాష్యం చెప్పారు.

ప్రతీ అమ్మకు తన పిల్లలు అందరూ సమానమే అయినా బాగా శ్రద్ధగా చదువుకునేవారు, తను చెప్పిన పని శ్రద్ధగా చేసేవారు, ఎవరితోనూ గొడవలు పెట్టుకోని పిల్లలని కొంచెం ఎక్కువ ఇష్టపడుతుంది అమ్మ.

అలాగే తరగతిలో పిల్లలందరూ అమాయకులు, మంచివారే అయినా వారిలో సమయానికి బడికి వస్తూ బాగా చదివేవారు, ఇతర పిల్లలతో స్నేహంగా మసిలేవారు అంటే ఉపాధ్యాయులు కొంచెం ఎక్కువ ఇష్టపడతారు.

మంచివారు చాలా మందే ఉంటారు కదా. మరి అమ్మవారు ఎటువంటి మంచివారిని ఇష్టపడుతారు.

పరమాత్మ ఈ విషయాన్ని గీతలో చాలా అద్భుతంగా తెలియచేసారు:

" తేషాం జ్ఞానీ నిత్యయుక్త 

  ఏకభక్తిర్విశిష్యతే, ప్రియో హి  

  జ్ఞానినోఽత్యర్థమహం 

  స చ మమ ప్రియః "

            ‌- భ.గీత 7:17

" భక్తులలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారు, మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని, అందరి కంటే, శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడిని మరియు వారు నాకు ప్రియమైనవారు " అని.

ఎంత అద్భుతం. భక్తులు నన్ను ఇష్టపడతారు, నేను వారిని ఇష్టపడుతాను అన్నారు పరమాత్మ. 

ఇటువంటి భక్తులు పూజ చేసేటప్పుడు అమ్మవారే ఎదురుగా కూర్చున్నట్లుగా భావిస్తారు, ఆనందభాష్పాలతో సేవలు చేస్తారు.

ఇలా అనన్యభక్తితో సాధన చేసేవారు శిష్టులు, అమ్మవారికి ఇష్టులు.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ