అమ్మవారే శివుని కన్నా గొప్పవారు అన్నారు శంకరులు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శివపరా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 410 వ నామం.
" శివపరా " అంటే శివుని కంటే శ్రేష్టురాలు అని భాష్యం చెప్పారు. అలా ఎలా అనిపించవచ్చు. కాని ఇప్పుడు కూడా ఎందరో స్త్రీలు ఉత్తమ స్థానాలలో ఉండి ఎంతో సమర్ధవంతంగా పనిచేయడం చూస్తూంటాం. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అనే నానుడి వింటూంటాం కూడా. కొన్ని సమస్యలను తండ్రి కంటే తల్లే చక్కగా పరిష్కారించడం చూస్తూంటాం. కొన్ని రాష్ట్రాలనూ, దేశాలనూ స్త్రీలు చక్కగా పాలించడం చూసాం కూడా.
భండాసురుడు, అతని తమ్ముళ్ళు విశుక్రుడు విషంగుడు అనేవారు దేవతలను, ప్రజలను తమ మాయాబలంతో పీడించుకు తినేవారు. దేవతలు దెబ్బలు తిని తిని నిస్సత్తువతో బాధపడేవారు. వెళ్ళి అందరూ త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు కాపాడమని.
భండాసురుడి శక్తులు తెలుసు కనుక అమ్మవారే దిక్కు అని త్రిమూర్తులు తలచి శివుడి ఆధ్వర్యంలో మహాయాగం చేసారు. శివుడు తన మూడవకన్ను ఫాలనేత్రంనుంచి అగ్నిని సృష్టించి హోమగుండంలో వేసారు.
యాగం అయాక ఆ అగ్నికుండంలోంచి అమ్మవారు ఉద్భవించారు. అందుకే అమ్మవారిని " చిదగ్నికుండసంభూతా " అని కొలుస్తున్నారు. ఆవిడే శ్రీలలితామహాత్రిపురసుందరీదేవి.
విష్ణుసహస్రనామాలలో " లక్ష్మీః " అని ఒక నామం ఉంది. దానికి " లక్ష్మీ స్వరూపులు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.
ఆదిశంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం చేస్తూ ఇలా ప్రార్థిస్తారు:
" చితాభస్మాలేపో గరళమశనం
దిక్పటధరో జటాధారీ కంఠే
భుజగపతిహారీ పశుపతిః,
కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం
భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదమ్ "
" ఓ తల్లీ, చితాభస్మం వంటికి పూసుకునేవాడు, విషాన్ని ఆహారంగా సేవించేవాడు, దిక్కులను దుస్తులుగా ధరించేవాడు, జడలు కట్టిన జుట్టు గలవాడు, కంఠంలో పాములను ధరించేవాడు, కపాలం చేతిలో గలవాడు, భూతనాయకుడు ఇన్ని అవలక్షణాలు ఉన్న శంకరుడిని జగదీశ్వరుడు అని ఎందుకు కొలుస్తున్నామో తెలుసా. నిన్ను వివాహం చేసుకోవడం వలన ఆయనకా ఫలం వచ్చింది " అని ప్రార్థించారు శంకరులు.
శంకరాచార్యులు వారే అలా అన్నారంటే నమ్మకుండా ఎలా ఉంటాం.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏
ReplyDelete