పనికిరాని పుస్తకాలు చదువకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" కావ్యాలాప వినోదినీ " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 613 వ నామం. 

" కావ్యాలాప వినోదినీ " అంటే " కావ్యపఠనంతో మిక్కిలి సంతోషించునది " అని అర్థం.

" వాక్యం రసాత్మకం కావ్యం " - వాక్యాలు రసాత్మకంగా ఉంటే కావ్యం అంటారు.

కావ్యాలను చదువుతూంటే విని ఆనందిస్తుంది అమ్మవారు. వేదాలలో " కావ్యాలాపాంత వర్జయేత్ " అని ఉంటుంది- అంటే కావ్య పఠనం వద్దు అని. అదేమిటీ అనుకోవచ్చు కాని దాని అర్ధం " అసత్ కావ్యాలు " అంటే పనికిరాని పుస్తకాలు చదవకండి అని.

కావ్యాలు 2 రకాలు సత్ కావ్యాలు అంటే " ధర్మం, భక్తి, జ్ఞానం " లని వృద్ధిచేసేవి. అసత్కావ్యాలు అంటే సత్కావ్యాలు కానివి. 

మానవులు 3 రకాలుగా కాలక్షేపం చేస్తారు అని ఈ సందర్భంగా పూజ్యులు సామవేదం వారు తెలియచేసారు.

మొదటివారు సత్కావ్యాలు చదువుతూ ఉంటారు . వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే వస్తూంటాయి. అమ్మవారి అనుగ్రహం పొందుతారు. సుఖ దుఃఖాలను ఒకే విధంగా చూస్తూ జీవిస్తారు. 

ఇక రెండో రకం మనుషులు. వీరు పాత బాధలను కష్టాలను తలచుకుని తలచుకుని బాధపడుతూ ఉంటారు. వీరికి మనశ్శాంతి ఉండదు. " అశాంతస్య కుతః సుఖం - భ.గీత 2:66 ) - ఎప్పుడూ అశాంతిగా ఉండేవారికి సుఖం ఎక్కడిది అన్నారు పరమాత్మ.

ఇంక మూడవ రకం. వీరు ఎదుటివారిని గిల్లి బాధపెట్టి ఆనందిస్తూంటారు. ప్రశాంతంగా ఉన్న సరస్సులో రాయి వేసి అలలనాట్యాన్ని చూసి ఆనందిస్తూంటారు. ఇదివరకు వ్యంగ్యంగానో కించపరుస్తూనో మాట్లాడేవారు ఊర్లలోనూ ఇళ్ళలోనూ. ఇప్పుడు వాట్సప్ వచ్చాక ఈపని ఇంకా సులభం అయిపోయింది. 

ఈ మాయలోంచి బయటపడటం అంత సులభం కాకపోయినా అమ్మవారి పాదాలను ఆశ్రయించి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటే ఏదో ఒకరోజు అమ్మవారి అనుగ్రహం పొందడం కష్టం ఎంతమాత్రం కాదు అని పెద్దలు పూజ్యులు సెలవిస్తున్నారు.

సత్కావ్య పఠనం చేస్తూ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేద్దాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ