అంతర్జాతీయ యోగాదినోత్సవం నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏
" అంతర్జాతీయ యోగాదినోత్సవం " నేడు.
యోగం అంటే కలయిక. యోగాభ్యాసం అంటే జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడే సాధన. ఏ సాధన చేయాలన్నా ఆఖరికి పదినిముషాలు జపం చేయాలన్నా శరీరం సహకరించాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడేవి యోగాసనాలు. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సుతో పాటు అన్ని జ్ఞానేంద్రియాల నిగ్రహంతోనే యోగాభ్యాసం చేయగలుగుతారు. అందుకని యోగాభ్యాసానికి యోగాసనాలు కొంతవరకు ఉపయోగపడతాయి.
యోగా అనగానే మనకు పతంజలి మహర్షి, ఆయన ప్రతిపాదించిన యోగాసూత్రాలు గుర్తుకు వస్తాయి. " యోగః చిత్తవృత్తి నిరోధః - యోగము మనస్సును నియంత్రిస్తుంది " అన్నది ఆయన ముఖ్య యోగసూత్రం. పతంజలి మహర్షి గురించిన కొన్ని అద్భుతవిషయాలు నెమరువేసుకుందాం.
ఈయన కాశ్మీరంలోని గొనార్డా అనే ప్రదేశంలో పుట్టారు. ఈయన్ని గొనార్డియా అనీను గోనికాపుత్ర అని పిలిచేవారు.
ఓరోజు ఈయన స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేద్దామని దోసిలిలోకి నీరు తీసుకుంటే దోసిలిలో చిన్నపాముపిల్ల కనిపించింది. " ఎవరునువ్వు " అని అడిగితే తను ఆదిశేషువునని చెప్పారు. దేనికి వచ్చావు అంటే నీలో నివశిస్తూ పాణిని " అష్టాధ్యాయి " వ్యాకరణానికి నువ్వు మహాభాష్యం వ్రాస్తే సహాయం చెయ్యడానికి వచ్చానని చెప్పారు ఆదిశేషువు. అలా పాణిని " అష్టాధ్యాయి " వ్యాకరణానికి అత్యద్భుత మహాభాష్యం వచ్చింది.
పత్ (పతః) + అంజలి = పతంజలి. అంజలి/దోసిలి లో పడింది ( ఆదిశేషువు ) కనుక అప్పటినుంచీ ఈయన పతంజలి అని పిలువబడ్డారు. ఈవిషయం పరిశోధించి ప్రపంచానికి చెప్పినది " విలియమ్స్ " అనే ఆయన.
రష్యా దేశానికి చెందిన లూయీస్ రేణు తనపరిశోధనలతో యోగసూత్రాలు వ్రాసినాయన, అష్టాధ్యాయి మహాభాష్యం వ్రాసినాయన వేరు వేరు అన్నారు కాని జేమ్స్ వుడ్ అనే ఆయనా, సురేంద్రనాథ్ దాస్గుప్తా గార్లు ఎన్నో ఆధారాలు చూపించి ఇద్దరూ ఒకరే అని చెప్పటం జరిగింది.
పతంజలి యోగా అంటే ప్రస్థుతపు ఆసనాలు కాదు. ఆదిశేషువు ఆయన శరీరంలో ఉన్నప్పుడు తోక మూలాధారంలో తల/పడగ తలలోనూ ఉంది, మిగతా శరీరం వెన్నుపాములో ఉంది.
పతంజలి గ్రహించినది అందరి శరీరాలలోనూ చైతన్యం మూలాధారంలో పాములా చుట్టుకుని పడుకుని ఉంటుంది అని. దానిని సాధనతో జాగృతం చేస్తే మెల్లిగా సాధన చేసే కొలదీ మూలాధారం నుంచి పైకిలేస్తూ మిగతా 5 చక్రాలను దాటుకుని పడగ శీర్షం/తల పైకి చేరుతుందని. ఇదే " సహస్రారం " - వేయి పడగల/రేకుల ఆదిశేషువు/పద్మం. ఎందరో ఋషులు, యోగులు, మహాత్ములు సాధనచేసి చైతన్యాన్ని జాగృతం చేసుకుని ముక్తిని పొందారు.
ఈ లూయీస్ రేణు, విలియంస్, జేంస్ వుడ్, మాక్స్ ముల్లర్ మొ.గువారు పరిశోధనలు మొదలుపెట్టినది మన వేదవిజ్ఞానం మీద ప్రేమతో కాదు. ఇంత మరీ ఎక్కువగా చెబుతున్నారు వేదవిజ్ఞానం గురించి అందరూ, నిజమేనా అని పరీక్షించడానికి సంస్కృతం నేర్చుకుని మరీ పరిశోధనలు చేసి చివరికి సత్యం గ్రహించి మన విజ్ఞానానికి ముగ్ధులయారు దాసులయారు.
" యోగః కర్మసు కౌశలం ( భ.గీత 2:50 ) " - యోగసాధన నైపుణ్యమయినది అన్నారు పరమాత్మ. ఈ యోగాభ్యాసం గురించి పరమాత్మ గీతలో 6వ అధ్యాయం " ధ్యానయోగము " లో చిన్న పిల్లవాడికి కూడా అర్ధమయేలా ఇలా తెలియచేసారు:
మంచి వస్త్రములు ధరించి, ఏకాంత ప్రదేశంలో, ఎత్తు పల్లం కాని మెత్తటి ఆసనంమీద కూర్చుని దృష్టిని నాసికాగ్రం మీద నిలిపి తనను ధ్యానం చేయమన్నారు. ఎక్కువ తక్కువ కాకుండా సమంగా భుజించేవారికి, సమంగా నిద్రపోయేవారికే యోగాభ్యాసం కుదురుతుంది అన్నారు. చేయమనడమే కాదు, ఎలా చేయాలో కూడా విపులంగా వివరించారు. ఎంత అద్భుతం మన వాజ్మయం.
ఈరోజు జ్యేష్ట బహుళ ఏకాదశి. జ్యేష్ట బహుళ ఏకాదశిని యోగినీ ఏకాదశి అంటారు. ఈ రోజున యోగులు, మునులు, ఋషులు ఉపవాసం ఉండి, విష్ణువుని పూజిస్తారని పురాణాలూ చెబుతున్నాయి.
మన సంస్కృతిని, వాజ్మయంని కాపాడుకోవలసిన బాధ్యత మనదే.
యోగాదినోత్సవం, యోగినీ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment