మన శరీరాలన్నీ ఈశ్వర అంశలే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" క్షేత్రేశీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 342 వ నామం.

" క్షేత్రేశీ " అంటే శరీరములకు ప్రభువైన శంకరుని భార్య అని భాష్యం చెప్పారు. మన శరీరాలన్నీ ఈశ్వర అంశలే. అర్ధనారీశ్వరుడు కనుక మన శరీరాలకు యజమానులు శంకరులు, అమ్మవారు. 

వేదంలో " అగ్నేర్యధా స్ఫులింగాః ..... " అని ఒక మంత్రం ఉంది. అగ్నినుండి స్ఫులింగములు అంటే అగ్గిరవ్వలు బయలుదేరి పైకి ఎగిరి వచ్చినట్లు ఈశ్వరుడి నుండి జీవులు బయటకు వస్తున్నాయని ఉపమానం. యాజ్ఞవల్క్యస్మృతిలో కాల్చిన ఇనుపగుండునుంచి స్ఫులింగములు వచ్చినట్లు జీవులు వస్తున్నారు అని తెలియచేసారు.

అగ్నిలోంచి పైకెగిరే రవ్వలలో కూడా ఉండేది అగ్నియే కదా. అంటే పరమాత్మలోంచి వచ్చిన జీవులలో ఉండేది పరమాత్మయే. " అహం బ్రహ్మాస్మి " అంటే ఇదే.

క్షేత్రం/శరీరం గురించిన విషయాన్ని మహాభారతంలో ఇలా తెలియచేసారు వ్యాసర్షి: 

" క్షేత్రాణి హి శరీరాణి 

  బీజం చాపి శుభాశుభం, 

  తాని వేత్తి స యోగాత్మా

  తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే " 

            - 35:01:06

" శరీరములను క్షేత్రములందురు. ప్రాణుల శుభాశుభకర్మములు వానికి బీజము. యోగాత్ముడగు పరమాత్ముడు ఈ రెంటిని ఎరిగియుండును. అందుచే అతడు క్షేత్రజ్ఞుడని వ్యవహరింపబడుతాడు " అని. 

" జ్ఞ " అంటే చైతన్యం, తెలుసుకొనుట. క్షేత్రంలో చైతన్యంగా ఉండేవారు శివుడు కనుక క్షేత్రజ్ఞుడు అన్నారు. చైతన్యం ఉంటేనే జీవం, లేకపోతే శవం. కొందరిని చూసినప్పుడు జీవం లేదు మనిషిలో అనిపిస్తుంది. అంటే నిస్తేజంగా ఉంటారు ఏదో సమస్య వల్ల.

అంటే శరీరాలన్నీ శివుడి అంశలే. శివుడు ఉంటే అమ్మవారు కూడా ఉన్నట్లే.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ