దండలో దారం వలే అంతర్లీనంగా అమ్మవారు జీవులందరిలోనూ ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" చేతనారూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 417 వ నామం.
" చేతనారూపా " అంటే చైతన్య స్వరూపురాలు. సమస్త జీవులయందు అమ్మవారి చైతన్యం ఉంటుంది.
దేవీభాగవతంలోని మొదటి శ్లోకంలో " ఏ శక్తి మాకు ధర్మబుద్దిని ప్రేరణచేయుచున్నదో అట్టి సర్వచైతన్యస్వరూపురాలు, జ్ఞానస్వరూపురాలు అగు అమ్మవారిని ధ్యానము చేయుచున్నాము " అని ప్రార్ధన చేస్తాము.
" ఈశావాస్య మిదగ్ం సర్వం
యత్కించ జగత్యాం జగత్ "
ఈ సూక్తి ఈశావాశ్యోపనిషత్తులో మొదటి మంత్రంలో మొదటి పాదం. ఈ దృశ్యమాన విశ్వం అంతా ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది - అంటే భగవంతుడు విశ్వవ్యాపకుడని, విశ్వమంతా ఈశ్వరచైతన్యంతో నిండి ఉందని అర్థం.
విష్ణుసహస్రంలో " విశ్వం, విష్ణుః " అని ప్రార్ధిస్తాం స్వామిని.
పరమాత్మ గీతలో ఈ విషయాన్ని ఇలా అద్భుతంగా తెలియచేసారు:
" మత్తః పరతరం నాన్యత్
కించిదస్తి ధనంజయ,
మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ "
- భ.గీత 7:7
" ఓ ధనంజయా, నాకంటెను పరమకారణమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నియును సూత్రమున సూత్రమణులవలె నాయందే కూర్పబడి యున్నవి " అని.
మణిహారంలో మణులే కనబడుతాయి. వాటిని కలిపి ఉంచే దారం కనబడదు. పరమాత్మ చైతన్యం ఆ దారం వంటిది. మణులు జీవులు. సృష్టి అంతా ఈశ్వర చైతన్యమే.
సృష్టిలోని జీవులన్నింటినీ మణిహారంలోని దారంవలె తన చైతన్యంతో నింపి/కలిపి నడిపిస్తున్నారు అమ్మవారు. జీవులన్నీ వేరు వేరు అయినా వాటిలోని చైతన్యం మాత్రం ఒకటే. చైతన్యం ఉంటే జీవం, తొలగుతే శవం.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment