అమ్మవారు మంచివారిని ఇష్టపడుతారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శిష్ట పూజితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 412 వ నామం.
" శిష్ట పూజితా " అంటే శిష్టులచే పూజింపబడునది అని భాష్యం చెప్పారు. శిష్టులంటే మంచివారిలో మంచివారు/ఉత్తములు అని భావించాలి.
" చీమకు కూడా అపకారం చేయడండి ఆయన " అనడం వింటూంటాం. ఇతరులకు సహాయం చేయకపోయినా హాని చేయకపోతే మంచివారే. మరి సహాయం కూడా చేస్తే, మంచివారిలో ఉత్తములు.
విష్ణుసహస్రనామాలలో " యోగవిదాం నేతా " అని ఒక నామం ఉంది. యోగవేత్తలకు నాయకుడు విష్ణువు. నాయకుడు అంటే నడిపించేవాడు అని. జీవులను అందరినీ ఆయనే కదా నడిపించేది. మరి యోగవేత్తలకు మాత్రమే నాయకుడు అంటే ఎలా.
యోగం అంటే కలయిక. ఏమిటీ కలయిక?. జీవాత్మను పరమాత్మతో కలపడానికి, అనుసంధానం చేయడానికి సాధన చేయడం. దీనినే యోగాభ్యాసం అంటారు. నది వెళ్ళి సముద్రంలో కలిస్తే ఏమవుతుంది. నది ఉండదు, సముద్రమే మిగులుతుంది. అలాగే జీవాత్మ పరమాత్మతో కలిస్తే పరమాత్మ అయిపోతాడు.
ఇది చాలా కష్టమయిన సాధన. యోగాభ్యాసం చేయడానికి మనస్సుతో పాటు ఇంద్రియములు అన్నింటినీ నిగ్రహించుకోవాలి. సాధనలో ఉత్తీర్ణులయిన వారిని యోగవేత్తలు అంటారు. వీరు విష్ణువును తమ నాయకుడగా గ్రహిస్తారు. ఇతరులు త్రిగుణాల మాయ కారణంగా విష్ణువు శక్తులను కరుణను గుర్తించలేరు. జీవులందరినీ వారి కర్మఫలాలకు అనుగుణంగా నడిపించే విష్ణువు ఈ యోగవేత్తలను చేయి పట్టుకుని కృపతో నడిపిస్తారు. అదీ తేడా.
కంచి పరమాచార్యులను నడిచే దేముడు అని పూజించేది ఆయన యోగవేత్త అవడం వలననే. సాధారణ కర్మలు చేసేటప్పుడు కూడా ఆయన మనస్సు అమ్మవారు కామాక్షీదేవి మీదే ఉంటుంది. అమ్మవారి ధ్యానంలోనే గడుపుతూ ఉంటారు.
అటువంటి శిష్టులచే సదా పూజింపబడుతూ ఉంటారు అమ్మవారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment