అమ్మవారు మూలాధారంలో నిద్రాణమై ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మూలాధారైకనిలయా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 99 వ నామం.

" మూలాధారైకనిలయా " అంటే మూలాధారము ఒకే ఒక నిలయముగా ఉన్నది. మూలాధారం అంటే మన వెన్నెముక చివరలో 4 రేకుల పద్మం ఉంటుంది. అది అరుణవర్ణం, పృథ్వీతత్త్వం దాని మధ్యలో కులకుండము అనే బిందువు ఉంటుంది. ఆ బిందువులో అమ్మవారు " సిద్ధవిద్యాదేవి " నిద్రాణస్థితిలో ఉంటారు. అమ్మవారిని కుండలినీదేవి అని కూడా పిలుస్తారు. పామువలె మూడున్నర చుట్లు చుట్టుకుని ముఖమును కప్పుకుని పడుకుని ఉంటారు.

అమ్మవారు అలా నిద్రావస్థలో ఉండడానికి కారణం మనమే. అశాశ్వతమైన భౌతిక విషయాల వెంట పడి, మనలో శాశ్వతమైన అద్భుత శక్తి/చైతన్యం ఉందని మర్చిపోతున్నాం, తరించలేకున్నాం. మనకి లేని బాధ అమ్మవారికి ఎందుకు ఉంటుంది. 

శరీరంలోని 72 వేల నాడుల శక్తి ఇక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. వెన్నెముక ద్వారా సాగే ఈ నాడులలో ముఖ్యమైన సుషుమ్నా నాడి ఈ మూలాధారంని శిరస్సుపై ఉండే సహస్రారంని కలిపి ఉంచుతుంది. ఈ కుండలినీశక్తి మాయతో కప్పబడి ఉండడంవల్ల నిద్రాణస్థితిలో ఉంటుంది. సుషుమ్నానాడి ఇక్కడినుండే మొదలు అవుతుంది కనుక ఈ స్థానాన్ని మూలాధారం అన్నారు. కుండలినీ శక్తి నిద్రలో ఉన్నంత కాలం జీవుడు దేహాభిమానంతో పశువులా ప్రవర్తిస్తాడు.

యోగసాధనతో ఈ శక్తి ( అమ్మవారి ) ని మేలుకొలిపి సాధన చేయగా చేయగా అది పైకి ప్రయాణం మొదలుపెట్టి సుషుమ్నానాడి ద్వారా ప్రయాణం చేసి సహస్రారం లోని శివుడిని కలుస్తారు. అదే జీవాత్మ పరమాత్మల కలయిక. ఈ సాధననే యోగాభ్యాసం అంటారు.

ఈ సాధన ఎలా మొదలు పెట్టాలో, ఎలా చేయాలో గీతలో పరమాత్మ అద్భుతంగా తెలియచేసారు:

" యోగీ యుంజీత సతత

  మాత్మానం రహసి స్థితః,

  ఏకాకీ యతచిత్తాత్మా 

  నిరాశీరపరిగ్రహః " 

            - భ.గీత 6:10

" రహసి " అన్నారు అంటే ఏకాంతం. అలాగే " ఏకాకి " అన్నారు. అంటే ఒంటరిగా కూర్చోమని. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది కనుక. 

ఏకాంతంగా ఓ చక్కటి ప్రదేశంలో కూర్చోమన్నారు. అంత ఎత్తుకాని పల్లముకాని ఆసనమ్మీద కూర్చోవాలన్నారు. దానిమీద చక్కటి మెత్తటిచర్మం/వస్త్రం వేసుకోమన్నారు ( 6:11,12 ). ఆసనం అలా ఉంటే ఎక్కువసేపు సౌకర్యంగా కూర్చోగలుగుతారని.

ఎక్కువగా తినేవారికి, అసలు తినని వారికి, అతిగా నిద్రించే వారికి, అసలు నిద్రపోని వారికి ఈ సాధన పనికిరాదు అన్నారు.

అంటే మితాహారం తీసుకోవాలని. 

ఎంత అద్భుతంగా విపులంగా చెప్పారో పరమాత్మ. ఖాళీకడుపు అయినా, పొట్టనిండుగా ఉన్నా నిద్ర రావడానికి అవకాశముంది. మరి ఎత్తుపీటమీద కూర్చుంటే నిద్రమత్తులో క్రింద పడితే ఏమవుతుందో అందరికీ తెలుసు. అలాగే క్రింద కూర్చోవడంకూడా చాలామందికి కష్టమే కదా. 

శరీరం, శిరస్సు, కంఠం సమముగా/నిఠారుగా ఉంచుకుని దృష్టి నాశికాగ్రంపై ఉంచాలి ( 6:13,14 ) అన్నారు. కనుబొమల మధ్యనున్న భృకుటిపై దృష్టి నిలిపి జపం చేసుకోమన్నారు. భృకుటిలో జ్ఞానదేవత స్థితురాలై ఉంటారు. కుండలినీ శక్తి ఇక్కడ కు చేరగానే జ్ఞానోదయం అవుతుంది అంటే మాయ తొలగుతుంది. ముక్తికి మార్గము సుగమం అవుతుంది.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీవారాహీదేవీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ