కఠిన సాధన చేయాలి, అజ్ఞానం తొలగించడానికి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" బ్రహ్మగ్రంధివిభేదినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 100 వ నామం.
" బ్రహ్మగ్రంధివిభేదినీ " అంటే బ్రహ్మముడిని తొలగించేవారు అని భాష్యం చెప్పారు. గ్రంధి అంటే ముడి.
మూలాధారచక్రంలో అమ్మవారు నిద్రాణ స్థితిలో ఉంటారు. ఇది జీవుడి జ్ఞానాన్ని మాయ కప్పేయడం వలన. సాధనతో ఈ చైతన్యాన్ని మేలు కొలిపి సుషుమ్నానాడి ద్వారా పైకి ప్రయాణం చేయించగలుగుతే మాయ, విషయలాలసలు త్రగ్గడం మొదలవుతుంది. సుషుమ్నానాడికి మూలాధారచక్రం నుంచి ఆజ్ఞాచక్రం దాకా ఆరు చక్రాలు ఉంటాయి. రెండేసి చక్రాలకు ఒక ముడి ఉంటుంది. అవి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధులు. ఇవి సాధనలో వచ్చే పరీక్షలు/అడ్డంకులు.
మూలాధారానికి పైన స్వాధిష్ఠానానికి క్రింద ఒక ముడి, స్వాధిష్ఠానానికి పైన ఒక ముడి ఉంటాయి. ఈ రెండు ముడులను కలిపి బ్రహ్మముడి అంటారు. అందులో బ్రహ్మ కూర్చుని ఉంటారు. కఠిన సాధనతో బ్రహ్మ ముడి విప్పుకో గలిగితే విష్ణుముడివైపు ప్రయాణం కొనసాగుతుంది.
అసలు చైతన్యాన్ని లేపడమేమిటి, పైకి ప్రయాణం ఏమిటి అని సందేహం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" ధూమేనావ్రియతే వహ్నిః,
యధా దర్శో మలేనచ,
యధోల్బేనావృతో గర్భః,
తధా తేనేదమావృతం "
- భ.గీత 3:38
" పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే కప్పివేయబడును " అన్నారు పరమాత్మ.
ప్రతీ మనిషిలోనూ చైతన్యం ఉంటుంది. కాని అది త్రిగుణాల ప్రభావం వలన మోహం, కోరికలు, కోపం మొదలయినవి ఆ చైతన్యాన్ని కప్పేస్తాయి. ఆ మాయను తొలగించుకోవడమే సాధన.
" స తు దీర్ఘకాల నైరంతర్య సత్కార
- ఆదర - ఆసేవితో దృఢభూమిః "
- యోగ సూత్రం 1.14
"చాలా కాలం పాటు నిరంతరం, భక్తితో, శ్రద్ధతో అభ్యసించినట్లయితే, అది దృఢంగా స్థిరపడుతుంది " అని తెలియచేసారు పతంజలి. బ్రహ్మముడి విడడానికి 12 సంవత్సరాలు పడుతుందని సాధకులు అనుభవంతో తెలియచేసారు.
మూలాధారచక్రంలోని అమ్మవారు కఠిన సాధన కారణంగా స్వాధిష్ఠానచక్రం వద్దనున్న బ్రహ్మముడిని తొలగించి మణిపూరచక్రానికి చేరుస్తారు జీవుడిని.
బ్రహ్మముడి తొలగుతే ముందర మాయ తొలగుతుంది. సాధన కొనసాగించి విషయలాలసలు తొలగించుకుంటే జ్ఞానాన్ని పొందడానికి మార్గం సుగమమవుతుంది.
సాధన శ్రద్ధగా చేయాలే కాని సాధకుడికి ప్రతీ మెట్టులోనూ అమ్మవారి పూర్తి సహకారం లభిస్తుంది.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీవారాహీదేవీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment