మణిపూరచక్రం జలతత్త్వం, చల్లబరుస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మణిపూరాంతరుదితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 101 వ నామం.
" మణిపూరాంతరుదితా " అంటే మణిపూరచక్రం మధ్యలో ప్రకటితమయినది అని భాష్యం చెప్పారు. మణిపూర+అంతః+ ఉదితా - ఉదితా అంటే ఉండునది అని.
నీలవర్ణం గల పదిదళముల పద్మంలో కూర్చుని ఉంటారు అమ్మవారు లాకిన్యంబస్వరూపిణి. జలతత్త్వం. స్వాంతన కలిగిస్తారు సాధకులకు.
ఇది మణులతో నిండి ఉంటుంది కనుక మణిపూరం. సూర్యచంద్రాగ్నులు ఈ చక్రంలోనే ప్రకాశిస్తారని ఆ కాంతులే మణులని అరుణోపనిషత్ తెలియచేస్తూంది. అమ్మవారు మణులు ధరించి మెరిసిపోతూ ఉంటారు.
ఒక్కసారి కళ్ళుమూసుకుని మణులతో నిండియున్న నీలవర్ణపు పది రేకుల పద్మంలో మణులు ధరించి మెరిసిపోతూ కూర్చున్న అమ్మవారిని ఊహించుకుంటే ఆ భావనే అద్భుతం.
ఈ చక్రం నాభి దగ్గరలో ఉంటుంది.
ఈ చక్రం మూసుకుని ఉంటే కీర్తి కోసం తహతహ, తనమాటే నెగ్గాలనే కోరిక వలన అసూయ, అసహనం, క్రూరత్వం, స్వలాభం, ఆత్మన్యూనతలతో బాధపడుతూ ఉంటారు జీవులు. ఈ చక్రం చైతన్యం అవుతే ఆత్మవిశ్వాసం పెరిగి కార్యసిద్ధి కలుగుతుంది. ఇక్కడే జీవుడికి " తను ఎవరు " అనే చింతన మొదలయి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు.
శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో మణిపూరంలోని అమ్మవారిని ఇలా ప్రార్ధన చేసారు:
" తటిత్త్వంతం శక్త్యాతిమిర
పరిపంథి స్పురణయా
స్పురన్నానారత్నాభరణ
పరినద్ధేంద్రధనుషమ్
తమశ్యామం మేఘం కమపి
మణిపూరైక శరణమ్
నిషేవే వర్షంతం హరమిహి
రతప్తం త్రిభువనం " - 40
" తల్లీ, మణిపూరచక్రములో అలుముకున్న చీకటిలో మెరుపువలె ప్రకాశించే నీవు స్వాధిష్ఠానములో శివుడు తన అగ్నిచేత దగ్ధంచేసిన లోకాలను నీ వర్షధారలచే తడుపుచున్నావు ( తాపాన్ని తొలగిస్తున్నావు అని భావం ). నవరత్నాభరణాలను ధరించి ఇంద్రధనుస్సు వలే ప్రకాశించుచున్నావు. నల్లని మేఘమును, మేఘరూపంలో ఉన్న శివుడిని ధ్యానిస్తున్నాను " అని.
అమ్మవారి పాదాలను ఆశ్రయంచి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీవారాహీదేవీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment