అమ్మవారు కనుబొమల మధ్య కూర్చుని ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ఆజ్ఞాచక్రాంతరాళస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 103 వ నామం.
" ఆజ్ఞాచక్రాంతరాళస్థా " అంటే ఆజ్ఞాచక్రంలోపల స్థితురాలయి ఉంటారు అని.
కనుబొమల మధ్య గల భాగాన్ని భృకుటి అంటాం. అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. అక్కడ మన మనస్సు ఉంటుంది.
ఆ ఆజ్ఞాచక్రపద్మం మధ్యలో పరమేశ్వరి, ప్రసన్నంగా ఆశీనురాలయి ఉంటుంది.
ఇది గురుస్థానం. జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ సాధన చేస్తే " ఆ అంటే కొంచెం, జ్ఞా అంటే జ్ఞానం కలుగుతుంది " అని భాష్యం చెప్పారు.
శ్రీవారాహీదేవి ద్వాదశనామాలలో ఒక నామం ఆజ్ఞాచక్రేశ్వరి. ఆజ్ఞాచక్రానికి ఈశ్వరి, అక్కడ 2 దళాలతో కూడిన పద్మంలో కూర్చుని ఉంటారు. ఈ రెండు దళాల రంగులు వేరు వేరుగా ఉంటాయి. ఇవి ఇడా, పింగళా నాడులకు సంకేతం.
ఆ రెండింటి మధ్య నుంచి సుషుమ్నానాడి, పైకి సహస్రారం వైపుకు ప్రయాణిస్తుంది. ఈ రెండు రేకలూ శివ, శక్తి స్థానాలకు కూడా సంకేతం. ఈ ఆజ్ఞాచక్రం వద్ద జపం చేస్తే, ఆజ్ఞాపించ గల గురువు/అమ్మవారు దర్శనం అవుతారు. ఇక్కడే జ్ఞానం సిద్ధిస్తుంది.
ఇక్కడికి చేరేటప్పటికి జీవుడు మనోనిగ్రహం పొంది, కోరికలు నశించి, భౌతిక విషయాల పట్ల చలించని స్వభావాన్ని కలిగి ఉంటాడు.
పరమాత్మ గీతలో సాధన ఎలా చేయాలో వివరిస్తూ ఇలా తెలియచేసారు:
" సమం కాయశిరోగ్రీవం
ధారయన్నచలం స్థిరః
సంప్రేక్ష్య నాశికాగ్రం స్వం
దిశశ్చానవలోకయన్ "
- భ.గీత6:13
" మనస్సును నిగ్రహించుకోవడానికి యోగాభ్యాసం చేసేటప్పుడు చూపును " నాశికాగ్రం " అంటే భృకుటిమీద నిలపాలి " అన్నారు. అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. గురుస్థానం. అజ్ఞానం తొలగుతుంది. మనస్సు నిలిస్తే సాధన సులభమవుతుంది.
అందుకే సనాతనధర్మం అక్కడ బొట్టు పెట్టుకోమని తెలియచేస్తూంది మనకు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీవారాహీదేవీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment