సాధన చేయగా చేయగా అమ్మవారు అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" దుర్లభా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 188 వ నామం .
" దుర్లభా " అంటే పొందశక్యము కానిది అని అర్ధం చెప్పారు కాని సులభంగా పొందగలిగేవారు కాదు అమ్మవారు అని తెలుసుకోవాలి. సాధన కొంచెం ఎక్కువగా చేయవలసి ఉంటుంది.
మూకశంకరులు వారి ఆర్యాశతకములో కామాక్షీదేవిని ఇలా ప్రార్థిస్తారు:
" చింతితఫలపరిపోషణ
చింతామణిరేవ కాంచినిలయా మే,
చిరతరసుచరితసులభా
చిత్తం శిశిరయతు చిత్సుధాధారా "
- ఆర్యాశతకం:3
అమ్మవారు కోరిన కోరికలు అన్నీ తీర్చే చింతామణిట. ఎప్పుడు అంటే " చిరతరసుచరిత " అన్నారు. అంటే చిరకాలము చక్కగా భక్తిగా సేవచేసుకుంటే అమ్మవారు సులభంగానే అనుగ్రహిస్తారు అని.
ఆదిశంకరులు సౌందర్యలహరిలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:
" త్రయాణాం దేవానాం త్రిగుణ................
.......ముకిళితకరోత్తంస మకుటాః "
శంకరులు " నీ త్రిగుణాల చేత పుట్టిన త్రిమూర్తుల పూజ అంటే నీ పాదపూజే కదమ్మా. నువ్వు పాదాలు పెట్టుకునే రత్నపీఠం దగ్గరే కదా త్రిమూర్తులు చేతులు జోడించి శిరస్సులు వంచి కూర్చుని ఉంటారు " అన్నారు.
సృష్టి స్థితి లయలు చూసే త్రిమూర్తులే అలా సాధన చేస్తూంటే భూలోక భక్తుల సాధన ఏరకంగా ఉండాలో ఊహించుకోవచ్చు.
అందుకే శంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం చేస్తూ " నజానే విలపనం - నాకు ఏడవడం కూడా రాదమ్మా " అని ప్రార్థించారు. పిల్లవాడు తను కోరింది తల్లి ఇవ్వకపోతే ఏడుస్తారు, తల్లి వెంటనే ఇస్తుంది. ఏడవడం కూడా రాదన్నారు శంకరులు. అలా శరణాగతి పొందాలి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment