వేదమాత శ్రీగాయత్రీదేవి జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః"🙏
ఈరోజు వేదమాత శ్రీగాయత్రీదేవి జయంతి. జ్యేష్ట శుద్ధ ఏకాదశి. శుభాకాంక్షలు.
" గాయత్రి " - అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 420 వ నామం.
" న గాయత్ర్యాః పరంమంత్రం
నమాతుః పరదైవతమ్ " -
అంటే తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము.
గాయత్రీ మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.
"గయాన్ త్రాయతే ఇతి గాయత్రి" అని ఆదిశంకరులవారు భాష్యం చెప్పారు . గయలు అనగా ప్రాణములు అని అర్థము. త్రాయతే అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం.
వాల్మీకిమహర్షి 24 వేల శ్లోకాలతో రామాయణంని వ్రాసారు. ప్రతి వేయి శ్లోకాల తరువాత శ్లోకంలో మొదటి అక్షరం గాయత్రీ మంత్రంలోని ఒక అక్షరాన్ని పెట్టి వ్రాసారు.
" గాతారం త్రాయతే ఇతి గాయత్రి " అంటే గానం చేసేవారిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని తెలుసుకోవాలి.
" గాయత్రీం ఛందసాం మాతా " అన్నాయి వేదాలు. ఛందో బద్ధం కనుక వేదం పేరు ఛందస్సు. వేదం యొక్క సారమే గాయత్రి అమ్మవారు. అందుకే ఆవిణ్ణి వేదమాతగా కొలుస్తారు. ఆవిణ్ణి " త్రిపదగాయత్రి " అంటారు - ఋగ్ యజుర్ సామవేదాలకి అధిపతి. మరి అధర్వణవేదం మాటేమిటి. దానికి వేరే గాయత్రి ఉంది. అందుకే అధర్వణవేదం నేర్చుకోవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి.
సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రీదేవిని ఆవాహన చేస్తూ " ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ....................గాయత్రీం ఛందం " అని ప్రార్ధిస్తాం. ఆవిడ " ఛందస్సు స్వరూపురాలు ". 24 అక్షరాల ఛందస్సు. మనం ప్రతిదినం చదివే " రుద్ర, దుర్గ, విష్ణు, లక్ష్మి, బ్రహ్మ, వాణి " అందరి గాయత్రుల్లోను 24 అక్షరాలు ఉంటాయి.
గాయత్రీదేవిని మంత్రరూపంగా ఇచ్చినది విశ్వామిత్రుడు. గాయత్రీమంత్రం బుద్ధిని ప్రచోదన చేస్తుంది. అంటే మంచి సంకల్పాలు/ఆలోచనలు కలిగేలా అనుగ్రహిస్తుంది. అంతకన్నా కావలసినది ఏముంటుంది సుఖమయమయిన జీవితానికి.
" తన్మే మనః శివ సంకల్పమస్తు - సంకల్పసూక్తం " - తల్లీ మంచి ఆలోచనలు కలిగించు మా మనస్సులలో అని ప్రార్ధనచేస్తాం ప్రతిదినం.
మనమనస్సుల్లో సత్సంకల్పాలకోసం గాయత్రీదేవి నిరంతరం మందేహదానవులతో ( క్షుద్రశక్తులతో ) పోరాడుతూ ఉంటుంది. అందుకే ఉపనయనం అయినవారందరూ ఆవిడికి శక్తిపెరగడం కోసం త్రిసంధ్యల్లోనూ అర్ఘ్యప్రదానం చేస్తారు..
పరమాత్మ భ.గీలో (10:35) " గాయత్రీ ఛందసాం అహం - ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును నేను " అన్నారు.
ఈ రోజు " శ్రీగాయత్రీదేవి " జయంతి. అందరి మనస్సుల్లోనూ సత్సంకల్పాలనే కలుగచేయమని తల్లిని శ్రద్ధగా వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీగాయత్రీదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment