అమ్మవారు (శక్తి ) తోడు లేకపోతే శివుడు కూడా జడమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" పంచప్రేతమంచాధిశాయినీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 947 వ నామం.

" పంచప్రేతమంచాధిశాయినీ " అంటే చైతన్యం ( అమ్మవారు - శక్తి ) ప్రవేశిస్తేనే ప్రేతాలు పనిచేస్తాయి అని. లేకపోతే జడమే.

పంచప్రేతా = పంచప్రేతాలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర , సదాశివులు.

అధిశాయినీ = అధిష్టించి ఉన్నది.

ప్ర + ఈతా = ప్రేతా అని విడదీస్తే అసలైన శాస్త్రార్ధం వస్తుంది. ప్ర – అంటే చక్కగా, ఈతా – అంటే వెళ్ళిపోయినది. చక్కగా వెళ్ళిపోయినది ఏమిటి జీవం/చైతన్యం/శక్తి.

శక్తి లోపల ఉంటే జీవుడు, శక్తి వెళ్ళిపోగానే ప్రేతం.

పంచభూతములు ప్రేతములే. పరమేశ్వరుడు నిష్క్రియుడు. పంచభూత రూపుడయిన పరమేశ్వరుడు అమ్మవారి చైతన్యంతో సకలకార్యాలు జరుపుతున్నాడు అని తెలుసుకోవాలి.

ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ అమ్మవారిని ఇలా స్తుతిస్తారు:

" గతాస్తే మంచత్వం 

  ద్రుహిణహరి రుద్రేశ్వరభృతః

  శివస్స్వచ్ఛచ్చాయా 

  కపటఘటిత ప్రచ్ఛదపటః

  త్వదీయానాం భాసాం 

  ప్రతిఫలన రాగారుణతయా

  శరీరీ శృంగారో రస ఇవ 

  దృశాం దోగ్ధికుతుకమ్ " - 92

" శక్తి తోడు లేకపోతే ఎంతటి వారైనా శక్తిహీనులే. ఓ దేవీ! అందుకే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరులు అనేవారు నీ మంచమునకు కోళ్ళుగా రూపొందారు. తెల్లని స్వచ్ఛమైన కాంతి కలిగిన నీ భర్త సదాశివుడు నీకు దుప్పటిగా నుండి నిన్ను కప్పుకొని ఎఱ్ఱని నీ మేని కాంతులు తనపై ప్రతిఫలించుటవలన ,తన తెల్లని శరీరమును ఎర్రగా మారి మూర్తీభవించిన శృంగారరసమువలె నయనములకు ఆనందమును ఇచ్చుచున్నాడు. అందుకనే నీవు ' శివాకారమంచే ' అని ' పంచబ్రహ్మాసనస్ధితా ' అని కీర్తంపబడ్డావు ".

అందుకే అమ్మవారు పరమేశ్వరుడిపై కూర్చున్నట్లు కొన్ని చిత్రాలలో చూస్తూంటాం.

సదా చైతన్యవంతంగా ఉండేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ