సత్సాంగత్యం కలగడం అంత సులభం కాదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" వీరగోష్ఠీప్రియా " అమ్మవారి ఒక అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 898 వ నామం.
" వీరగోష్ఠీప్రియా " అంటే వీరుల సభ ఇష్టముగా గలది.
" వీరులు " అంటే దీక్షలో ఉన్నవారు అని అర్ధం. అంతేకాని బలమైనవారు, ఆయుధాలు ధరించినవారూ అని కాదు. వీరులు కూర్చుని మాట్లాడుకుంటూంటే మురిసిపోతారుట అమ్మవారు. అటువంటివారు ఓ చోట చేరినప్పుడు ఏ విషయాలు మాట్లాడుకుంటారు?
" మహాసంగస్తు దుర్లభో
అగమ్యో అమోఘశ్చ
సర్వదా తదేవ సాధ్యతాం
తదేవ సాధ్యతాం "
అన్నారు నారదమహర్షి. సత్సాంగత్యం లభించడం కష్టంట. కాని దొరికాక అమోఘం అని. ఇంక వారికి నిత్యం ఆనందమే.
కొందరు కనకదుర్గమ్మ దీక్ష తీసుకుంటారు. కొందరు అయ్యప్పస్వామి, హనుమ దీక్ష తీసుకుంటారు. అటువంటి వారు కొందరు ఓచోట కలిసి కూర్చున్నప్పుడు ఆ దేవీదేవతల మహిమలగురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నామజపం, భజనలు చేసుకుంటారు. అక్కడ వాతావరణం పవిత్రంగా ఉంటుంది.
పరమాత్మ భగవద్గీతలో ఇలా తెలియచేసారు:
" మచ్చిత్త మద్గ తప్రాణ
బోధయంత: పరస్పరం.
కథయన్తశ్చ మాం నిత్యం
తుష్యన్తి చ రమన్తి చ "
- భ.గీత 10:9
" నాయందే మనస్సు నిలిపినవారు, నా మీదనే ప్రాణములు నిలుపుకున్న వారు ఇద్దరూ ఒకచోట చేరితే నా గురించే మాట్లాడుకుంటారు, బోధించుకుంటారు. వారు అనునిత్యమూ తృప్తిగా ఉంటారు. వారి ఆనందానికి అవధులు లేవు " అని.
శ్రీరాముడు అవతారం చాలించేటప్పుడు హనుమను కూడా వైకుంఠం వచ్చేయమన్నారుట. " వైకుంఠంలో శ్రీరాముడు ఉండరు, రామజపమూ ఉండదు కనుక నేను రాలేను, ఇక్కడే ఉండి ఎక్కడెక్కడ రామకీర్తన జరుగుతుందో అక్కడ కూర్చుంటే నాకు సంతోషము, పరమార్ధమూ " అన్నారుట హనుమ. అలాంటిచోట శ్రీరాముడు ఎలాగూ ఉంటారని హనుమ అభిప్రాయం.
" యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకమ్ "
అందుకే అమ్మవారికి వీరులగోష్ఠులంటే అంత ఆనందం. అక్కడకు వచ్చి కూర్చుని ఏమి మాట్లాడుకుంటున్నారో విని సంతోషించి అనుగ్రహిస్తుంది.
భక్తికి, మోక్షానికి మొదటి మెట్టు " సత్సంగం " అంటే వీరగోష్ఠి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment