సాధన పూర్తి కాకపోయినా బాధపడనక్కరలేదు -చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" రుద్రగ్రంథి విభేదినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 104 వ నామం.

" రుద్రగ్రంథి విభేదినీ " అంటే రుద్ర ముడిని విప్పువారు అని భాష్యం చెప్పారు.

కంఠంలో విశుద్ధిచక్రం ఉంటుంది. అది ఆకాశతత్త్వం. విష్ణుగ్రంధి విడివడిన తరువాత జీవుడిలోని వాయుతత్త్వం విశుద్ధిచక్రం లోని ఆకాశం ద్వారా ప్రయాణించి సాధనతో రుద్రగ్రంధిని ఛేదిస్తే బ్రహ్మరంధ్రంగుండా పైకి వెళ్ళి ఆకాశంలో కలుస్తుంది. అప్పుడు లోపలా బయటా ఆకాశమే. చిదానంద స్థితి.

ఆజ్ఞాచక్రానికి చేరిన జీవుడికి మూడవ కన్ను తెరుచుకుంటుంది.  ఇక్కడ మనసు నిలిపి సాధన చేస్తే అమ్మవారు రుద్రగ్రంధిని భేదనము చేస్తారు. " నేను " అనే భావన తొలగి ముక్తికి మార్గం సుగమం అవుతుంది.

విష్ణుగ్రంధి విడివడిన తరువాత సాధన శ్రద్ధగా కొనసాగిస్తే రుద్రగ్రంధి ఛేదనకు మూడు సంవత్సరాల సమయం పడుతుందని సాధకులు అనుభవంతో తెలియచేసారు. 

సాధకులకు ఓ అద్భుతమయిన సందేహం కలుగుతుంది. మూడు ముడులు అంటే అడ్డంకులు తొలగడానికి కఠిన సాధన చేస్తేనే 18+6+3 - 21 సంవత్సరాలు పడుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు కదా. మరి అంతకాలం సాధన సాధ్యమా. మధ్యలో ఏదయినా ( మరణం కూడా ) అయితే ఉపయోగమేమిటి. ఇదే సందేహం అర్జునుడికి కూడా వచ్చింది.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" ప్రాప్య పుణ్యకృతాం 

  లోకానుషిత్వా శాశ్వతిః సమాః,

  శుచీనాం శ్రీమతాం గేహే 

  యోగభ్రష్టో2భిజాయతే "

              - భ.గీత 6:41

" యోగ భ్రష్టులైన వారు ( అంటే సాధన పూర్తి కానివారు, ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు ), పుణ్య లోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప, వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు " అని. 

ఇక్కడ సంపన్నులు అంటే ఆధ్యాత్మిక సంపన్నులు. అప్పుడే క్రితం జన్మలో మధ్యలో నిలిచిపోయిన సాధన సులువుగా కొనసాగుతుంది. ఇంటి వాతావరణం సాధనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి. సాధన కొనసాగించి మోక్షం పొందుతారు.

అందుకని సాధన పూర్తి కాకపోయినా నష్టం లేదు, దాని ఫలితం దానికి ఉంటుంది. 

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్ 


 

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ