అమ్మవారు అందరినీ గమనిస్తూ ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" విశాలాక్షీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 936 వ నామం.
" విశాలాక్షీ " అంటే విశాలమయిన కన్నులు గలది అని అర్ధం. 84 లక్షల జీవరాశులను గమనించుకుంటూ ఉండాలంటే ఎంత పెద్ద కనులు ఉండాలి. ఆదిశంకరులు శ్రీలలితా పంచరత్న స్తోత్రం చేస్తూ అమ్మవారిని " ఆకర్ణదీర్ఘనయినీ " అని ప్రార్థించారు. చెవులదాకా సాగి ఉన్నాయిట అమ్మవారి కనులు.
మూక శంకరులు కామాక్షీ అమ్మవారి కన్నుల ప్రభావాన్ని వర్ణిస్తూ 100 శ్లోకాలతో కీర్తించారు. అది కటాక్షశతకంగా ప్రసిద్ధి చెందింది. ఈ శ్లోకంలో ఇలా ప్రార్థించారు:
" కల్లోలితేన కరుణారసవేల్లితేన
కల్మాషితేన కమనీయమృదుస్మితేన
మాముంచితేన తవ కించన కించితేన
కామాక్షి తేన శిశిరీకురు వీక్షితేన "
అమ్మా కామాక్షీ నీ శరీరము ఒక కరుణాసముద్రము, కన్ను అందు తరంగమువలె ఉన్నది. అందు దయారసము పొంగుచున్నది. ఆ కన్ను కొంచెము వంగి పూజింపదగినదిగా తోచును. అందు అందమైన మందహాసము చిందులు త్రొక్కును. దానికి కాటుక దిద్దబడియున్నది. అట్టి నీ కంటి చూపుతో సంసారతప్తుడనయిన నన్ను చల్లబరచుము.
కామాక్షీ అంటేనే కంటిచూపుతో కోరికలను తీర్చే తల్లి. అమ్మవారి చల్లటిచూపులు మనందరి మీదా కూడా పడేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment