మంచి మంచి పూలతో పూజ చేసినా శ్రద్ధ ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" చైతన్యకుసుమప్రియా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 919 వ నామం.
" చైతన్యకసుమప్రియా " అంటే చైతన్యకుసుమాలతో చేసే పూజను ఇష్టపడుతారు అని.
" జ్ఞాతా హోతా, జ్ఞానం అర్ఘ్యం, జ్ఞేయం హవిః......" - అని తెలియచేస్తూంది భావనోపనిషత్తు.
అమ్మవారికి జ్ఞానకుసుమాలని సమర్పించాలి. ఏదో మ్రొక్కుబడిగా చేసేయకూడదు పూజని.
పువ్వులు కూడా జడమే. కోస్తేనే ఇంట్లోకి వస్తాయి, వేస్తేనే అమ్మవారి పాదాలపై పడతాయి. కాని ఆ జడపువ్వుని కూడా చైతన్యపూవుగా భావించి పూజచేస్తే ఆవిడ సంతుష్టురాలయి అనుగ్రహిస్తారు.
పూజలో నైవేద్యం తరువాత ముఖ్యమయినది " మంత్రపుష్పం ". ఓ పువ్వు ని చేతిలో పట్టుకుని అమ్మవారి గుణగణాలను స్మరించుకుని ఆ పువ్వుని ఆవిడ పాదాలపై వేస్తాము. అప్పుడు ఆ పువ్వు చైతన్యపుష్పంగా అవుతుంది.
గణపతిని కూడా ప్రత్యేకంగా గరికతోటే కాకుండా 21 పత్రులతో ఒక్కొక్కపత్రి పేరు చదువుతూ పూజిస్తాం. అంటే వాటిని చైతన్యపత్రిగా సమర్పిస్తాము.
" ఏకబిల్వం శివార్పణం " అంటారు. అలా పేరు చెబుతూ పూజచేస్తారు భక్తితో.
" మిరా అల్ఫాసా " అనే ఓ ఫ్రెంచ్ యువతి
శ్రీఅరబిందో ( పుదుచ్చెరి ) అనుగ్రహంతో యోగం పొంది ధన్యురాలయి ఇప్పుడు భక్తులచే " మదర్ " అని పిలవబడుతున్నారు. ఆవిడ 350 పువ్వుల గురించి ఓ పుస్తకం వ్రాస్తూ ఒక్కొక్క పువ్వులోనూ ఒక్కొక్క సంస్కారం ఉందని వ్రాసారు. ఏపువ్వుతో పూజచేస్తే ఏ ఫలితం వస్తుందో కూడా విపులంగా వ్రాసారు అని తెలుస్తూంది.
అంటే మన సద్భావనతో పువ్వు చైతన్యమైన పువ్వుగా మారుతుంది. అటువంటి " చైతన్యకుసుమాలు " అంటే అమ్మవారికి మిక్కిలి ఇష్టం. అందుకే ఆవిడ " చైతన్యకుసుమప్రియా " అని పూజింపబడుతూంది.
" యాదేవి సర్వభూతేషు
శ్రద్ధారూపేణ సంస్థితా,
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః "
" శ్రద్ధ " లో ఆవిడ స్థితురాలై ఉంది. శ్రద్ధగా చేస్తే అనుగ్రహించకుండా ఎలా ఉంటారు అమ్మవారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment