అమ్మవారు ధనానికి అధ్యక్షులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ధనాధ్యక్షా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 885 వ నామం.

" ధనాధ్యక్షా " అంటే ధనమునకు అధ్యక్షురాలు అని. ధనమునకు స్వామిని అయినది.

ధనం అశాశ్వతం కదా మరి దానికి అధ్యక్షురాలు ఏమిటి? పైగా అమ్మవారు.

ధన్యతను ఇచ్చేది ధనం అన్నాయి శాస్త్రాలు. ఏ మంచి పనిచేయాలన్నా ధనం కూడా అవసరం. 

యజుర్వేదం/అధర్వణవేదాల్లో అధికసంపద కోసం చేసే యాగం ఉంది. కోరికలు తప్పుకాదు. వివిధరకాలైన కోరికలు తీర్చుకోవడానికి వీలుగా చాలా కార్యక్రమాలు తెలియచేసాయి మన వేదాలు/శాస్త్రాలు. ఈ యాగంలో చివరన " సంపదను చేతిలో ఉంచు " అని కోరడం ఉందిట. " ఎవరి చేతిలో ఉంచాలి, ఎందుకు నా చేతిలో ఉంచు అని అనలేదు " అనే సందేహం వచ్చిందిట పండితులకు. " పాహిమాం - నన్ను రక్షించు, దేహిమాం - నాకు ప్రసాదించు " అని కదా ప్రార్ధిస్తాం అమ్మవారిని, ఆ మంత్రం లో అలా స్ఫష్టంగా ఎందుకు లేదు అన్నది సందేహం.

శృంగేరీపీఠం 12వ పీఠాధిపతి శ్రీశ్రీ విద్యారణ్యస్వాముల వారు ఈ సందేహాన్ని తీర్చారు. ఏమని అంటే " నీ " అని తీసుకోవాలి అందుకే " నా " అని చేర్చలేదు అని. అదేమిటండీ యాగం చేసినాయన సంపదని దేవుడు చేతిలో ఉంచమనడం ఏమిటి అంటే స్వామి అన్నది " నీ చెయ్యి, దోసిలి ఎంత ఉంటుంది, 100 కాసులు కూడా పట్టవు " అదే పరమాత్మ అయితే " సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్....... " - సహస్ర అంటే వెయ్యి కాదు అనేకం అని - పరమాత్మ అనేకమయిన చేతుల్లో మన సంపదను ఉంచేస్తే ఎప్పుడు అవసరమయితే అప్పుడు ఇస్తూంటారు మనకు అని. 

ఎంతటి మేధోసంపత్తి, అద్భుత భావన, సందేహ నివృత్తి.

అందుకే అమ్మవారు ధనాధ్యక్షురాలు. మనం అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మనకు అవసరమయిన ధనాన్ని అమ్మవారే ఇస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ