సాధనకు కూడా అమ్మవారి అనుగ్రహం కావాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" భక్తహార్దతమోభేదభానుమద్భాను సంతతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 404 వ నామం.
ఈ నామానికి " భక్తుల హృదయమందున్న అజ్ఞానమనే చీకటిని పోగొట్టుటయందు సూర్యుని కిరణ పరంపర అయినట్టిది " అని భాష్యం చెప్పారు.
సూర్యుడు తన కిరణాలతో చీకటిని తొలగించినట్లు అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మన హృదయం లోని అజ్ఞానాన్ని తొలగిస్తారు.
" అంగుష్ఠమాత్రః పురుషో
మధ్య ఆత్మని తిష్ఠతి "
- కఠోపనిషత్తు 2:1:12
మన హృదయంలోనే బ్రొటకనవ్రేలు పరిమాణంలో అమ్మవారు ఉంటారు అని తెలియచేస్తూంది కఠోపనిషత్తు.
అమ్మవారు హృదయంలో చిన్న మొగ్గ రూపంలో ఉంటారు. అది పువ్వుగా చైతన్యంగా అవాలంటే నిరంతర కృషి ఉండాలి.
రమణమహర్షి తరచూ అనేవారు " పరమాత్మ గురించి తరువాత ఆలోచించవచ్చు, ముందర నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టు " అని. అంటే లోపలికి ప్రయాణం చేయాలి, హృదయలోనే ఉన్న అమ్మవారిని తెలుసుకో అని. దానికి కఠిన సాధన అవసరం.
రమణమహర్షి తన " అరుణాచల పంచరత్నం " లో ఇలా ప్రార్థిస్తారు:
" కరుణా పూర్ణ సుధాబ్ధే
కబళిత ఘన విశ్వరూప
కిరాణావల్యా, అరుణాచల
పరమాత్మన్ అరుణోభవ
చిత్తకంజ సువికాసాయ "
అరుణాచలశివుడు ఘనరూపంలో ఉన్న కరుణా సముద్రంట. చిత్తకంజ అన్నారు అంటే హృదయపద్మం. సూర్యుడు పద్మాన్ని వికసింపచేసినట్లు తన హృదయపద్మాన్ని వికసింపచేయి తండ్రీ అని ప్రార్థించారు. అంటే అజ్ఞానాన్ని తొలగించమని.
సాధనకు కూడా అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే తప్పకుండా అనుగ్రహిస్తారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment