అమ్మవారిని పాదాలను ఆశ్రయిస్తే మాయ తొలగుతుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏 " శ్రీమాత్రేనమః "🙏
" కూటస్థా " - అమ్మవారి అద్భుత నామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 896 వ నామం.
" కూటం " అంటే మాయ/అజ్ఞానం. " కూటస్థా " అంటే మాయ మీద/లోపల కూర్చుని ఉన్నారు అమ్మవారు అని తెలుసుకోవాలి. కూటం అంటే పర్వతశిఖరం ( ఉదా: చిత్రకూటం ), సమూహం ( ఉదా: ఇంద్రియసమూహం ) అని కూడా అర్ధాలు ఉన్నాయి.
అస్తమానూ " మాయ " అంటారు, వేరే పనిలేదా అనుకుంటారు.
" మాయ " అంటే " ఊహకందనిది " అని తెలుసుకోవాలి. అంతేకాని అందరూ అనుకునే వింతపదం కాదు. అమ్మవారు కాని, వారి లీలలు కాని ఊహకెలా అందుతాయి.
శ్వేతాశ్వతరోపనిషత్ ఇలా తెలియచేస్తూంది:
" మాయాంతు ప్రకృతిం విద్యాం
మాయినంతు మహేశ్వరం " అని. ప్రకృతి అంతా మాయే కదా.
ఇప్పటికీ మనం ( తిని కూర్చోక ) ఇంట్లో పిల్లలు బయటకు వెడుతూంటే 100 జాగ్రత్తలు చెబుతాం ( వాళ్ళు విసుక్కున్నా ). అదే మన సనాతనధర్మం చేసేది. కనబడేది అంతా మాయ, జాగ్రత్తగా ఉండు, అగ్నిలో పడే మిడతవు కాకు, కోరి కష్టాలు తెచ్చుకోకు అని పదే పదే తెలియచేస్తూనే ఉంటుంది, కొందరేనా బాగుపడతారని.
రామకృష్ణపరమహంసని ఓ భక్తుడు అడిగాడు " స్వామీ, అస్తమానూ మహామాయ అని, అమ్మవారు మాయ , పరమాత్మ మాయ అంటూ చెబుతూంటారు. మరి ఆ మాయ అమ్మవారిని ఏమీ చెయ్యదా " అని. ఆయన అన్నారు " త్రాచుపాము విషం అందరికీ హాని కాని త్రాచుపాముకు ఏమి అవదు కదా. అలాగే ఈ మాయ ఆవిడని ఏమీ చెయ్యదు, మనల్ని జాగ్రత్తగా ఉండమని తెలియచేస్తూనే ఉంటుంది " అని. ఎంత అద్భుతంగా సెలవిచ్చారు స్వామి.
మరి సృష్టి అంతా ఆవిడే కదా చేస్తూంది. మన కర్మలను అన్నిటినీ కూడా ఆవిడే చేయిస్తూన్నట్లు అనుకోవచ్చా. ఆవిడ ఏమీ ఇవ్వదు, తీసుకోదు. తమ కర్మఫలాలకు తగ్గట్లుగా జీవుల జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. మంచి కర్మలు చేస్తూంటే అన్ని సుఖాలను సౌకర్యాలను కలిగిస్తూ ఉంటుంది. చెడు కర్మలు చేసేవారికి వాటికి తగ్గ ఫలితాలను ఇస్తుంది. అందుకే " కర్మ కొద్దీ ఫలం " అన్నారు.
" తన్మే మనః శివసంకల్పమస్తు - సంకల్పసూక్తం " అని సంకల్పసూక్తం చెబుతూంది. అంటే " మా మనస్సులో మంచి ఆలోచనలు కలుగుగాక " అని ప్రార్థించడం.
" కూటస్థ " అయిన అమ్మవారిని మాయాప్రభావంలో పూర్తిగా మునిగిపోకుండా మనల్ని అనుగ్రహించమని మనమందరం వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment