అమ్మవారు కష్టాలు పోగొడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమ"🙏

" కాష్టాకాంతా " - అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 859,860 వ నామాలు.

" కాష్టా " అంటే కాలభాగాదిస్వరూపురాలు.

శ్రీలలితాసహస్రనామాలలో " కాంతా " అనే నామం రెండుచోట్ల వస్తుంది. కాంతా అంటే కమనీయమైనది/అందమైనది అని. అమ్మవారు అందంగా ఉండకుండా ఎలా ఉంటారు. అమ్మవారి వర్ణం అగ్నివర్ణం ( దుర్గా సూక్తం ), పైగా అమ్మవారు ఎప్పుడూ దరహాసోజ్వలముఖి, ఆకర్ణదీర్ఘనయని. కాని రెండుచోట్లా అదే అర్ధం వ్రాస్తే ఎలా అని ఆలోచనచేసి రెండోసారి వచ్చిన చోట " కాష్టాకాంతా " ని " కాష్టా + కాంతా " అని కాకుండా " కాష్టా + అకాంతా " గా విడగొట్టారు. అకాంతా అంటే అందంగా లేదని కాదు. కం అంటే సుఖం, అకం అంటే కష్టం కనుక అకాంతా అంటే కష్టాలను అంతంచేసేది/పోగొట్టేది అని భాష్యం వ్రాసారు. అమ్మవారిని " అందంగా ఉన్నావు " అని మళ్ళీ స్తుతించడంకన్నా " మాకష్టాలు తీర్చే తల్లివి " అని స్తుతిస్తే ఎంత అద్భుతంగా ఉంది. 

శంకరుల తరువాత వెయ్యి సం.లకు శ్రీభాస్కరరాయలు శ్రీలలితాసహస్రనామాలకు భాష్యం వ్రాసారు. ఈయన మహాపండితుడు, అమ్మవారి ఉపాసకుడు. వందల సం.లు అయిపోయినా ఇప్పటికీ శ్రీలలితనామాలకు ఆయన వ్రాసిన " సౌభాగ్యభాస్కరం " భాష్యమే ప్రామాణికంగా ఉంది . ఖండన చేయగలిగే విద్వాంసులు పుట్టలేదు, పుట్టబోరు.

అలా మహాపండితులు ఎన్నో శోధించి మధించి అద్భుతము, అమృతతుల్యము అయిన భాష్యాలు మనకు అందించారు. దీనిలోనే వారి మహిమాన్వితమయిన విద్వత్తు, శ్రమ, లోకకళ్యాణంపై ఆసక్తి, వాజ్మయంని భావితరాలకు అందించాలనే తపన మనకు కనబడుతుంది.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ