అమ్మవారు విశ్వమంతా వ్యాపించి ఉన్నారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సర్వాంతర్యామినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 819 వ నామం.

" సర్వాంతర్యామినీ " అంటే జీవులందరియందు ప్రవేశించు దేవి అని భాష్యం చెప్పారు. అమ్మవారి చైతన్యం సృష్టి అంతా వ్యాపించి ఉంటుంది. రాళ్ళు రప్పలలో కూడా చైతన్యం ఉంటుంది.

మన ఇంద్రియాలు కూడా జడమని ( పనిముట్లు మాత్రమే), వాటితో పనిచేయించే శక్తి బ్రహ్మమని, అదే బ్రహ్మం మనలో జీవాత్మగా ప్రవేశిస్తుందని, అందుచేత మనకేదో స్వతంత్రమైన శక్తి ఉందని అహంకరించ కూడదనే సందేశంతో కేనోపనిషత్తు ముగుస్తుంది.   

ఈశావాస్యోపనిషత్తులో ఈశ్వరుడి విశ్వవ్యాపకత గురించి బాగుగా వివరించారు:

" ఈశావాస్య మిదగ్ం సర్వం

  యత్కించ జగత్యాం జగత్ "

ఈ సూక్తి ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రంలో మొదటి పాదం.  ఈ కనబడుతూన్న విశ్వం అంతా ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది - అంటే భగవంతుడు విశ్వవ్యాపకుడని అర్థం. ఈ విషయం వేదంలో కూడా అనేక చోట్ల ప్రస్తావించ బడింది.  

ప్రసిద్ధమైన నారాయణ సూక్తంలో ఇలా తెలియచేసారు:

" యచ్చ కించిజ్జగత్సర్వమ్ 

  దృశ్యతే శ్రూయతే2పివా

  అంతర్బహిశ్చ తత్సర్వం 

  వ్యాప్య నారాయణః స్థితః "

ఈ ప్రపంచంలో కనిపించేది, వినిపించేది ఏది ఉందో, దాని లోపల, బయట కూడా ఉన్నవాడు నారాయణుడే (అంటే బ్రహ్మమే) అని.  ఇలా అంతా బ్రహ్మ మయమే అని గ్రహించి మానవుడు ఆయన మీదే మనస్సు లగ్నం చెయ్యాలని సందేశం.

" వేష్టి వ్యాప్నోతి ఇతి విష్ణుః - వ్యాపించినవాడు విష్ణువు " - విష్ణుసహస్రనామాలలో విష్ణుః ఒక నామం. విశ్వమంతా వ్యాపించి ఉన్నవారు అని భాష్యం చెప్పారు.

" తేన త్యక్తేన భుంజీథా 

  మా గృధః కస్య స్విద్ధనమ్ "

ఈ చరాచర ప్రపంచమంతా భగవన్మయమే అయినప్పుడు ఈ వస్తువు నాది, నేను సంపాదించాను అనుకోవడం అజ్ఞానం. అన్ని సంపదలు, సుఖాలూ భగవద్దత్తమైనవనే భావంతో, త్యాగ బుద్ధితో, అనాసక్తతతో అనుభవించుచూ ఎవరి ధనాన్ని ఆశించకుండా జీవిస్తే ముక్తి తథ్యం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ