ప్రాణం శిరస్సుపై నుంచి పోయేలా సాధన చేయాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సహస్రారాంబుజారూఢా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 105 వ నామం.

" సహస్రారాంబుజారూఢా " అంటే వెయ్యి దళముల పద్మములో కూర్చుని ఉంటారు అని భాష్యం చెప్పారు.

శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది. దాని క్రింద ఉన్న వెయ్యి దళాల పద్మంలో అమ్మవారు కూర్చుని ఉంటారు. సాధనతో ఇక్కడకు చేరుకున్న జీవుడికి " నేను " అనే భావన పోతుంది. ఇక ముక్తే అంటే బ్రహ్మరంధ్రం గుండా పైకి పోయి ఆకాశంలో కలిసిపోవడమే. ఆకాశమే అమ్మవారు.

ఇక్కడ ఓ అద్భుతమయిన విషయం ఉంది. శరీరం పంచభూతాల కలయిక. పంచభూతతత్త్వం. 

తైత్తిరీయ ఉపనిషత్తు ఇలా తెలియ చేస్తూంది:

" ఆకాశాత్ వాయుః,    

  వాయోరగ్నిః, అగ్నేరాపః,    

  అద్భ్యః పృధివీ " - 2:1:2              ‌  ‌ 

ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి కలుగుతున్నాయి అని.

శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశించిన ప్రాణము రుద్రగ్రంధిలో ఆకాశ వాయు తత్త్వాలుగాను, విష్ణుగ్రంధిలో అగ్ని తత్త్వంగాను, బ్రహ్మ గ్రంధిలో జల పృథ్వీ తత్త్వాలుగానూ ఉంటుంది. ఈ గ్రంధులలో ఉన్న అమ్మవారు సంపూర్ణ చైతన్యం కాదు, అంశ మాత్రమే. సహస్రారంలో ఉన్న అమ్మవారు సంపూర్ణ చైతన్యం. 

అమ్మవారే అయినప్పటికీ ఆకాశతత్త్వం కాస్తా " నేను " అనే మాయ కారణంగా భూమితత్త్వంగా అయిపోయి మూలాధారంలో నిద్రాణమై ఉంటుంది. ఈ నిద్రాణమై ఉన్న పృథ్వీతత్త్వంని యోగసాధనతో చైతన్య పరిచి సుషుమ్నానాడి ద్వారా పైకి ప్రయాణం చేయించగలిగితే మళ్ళీ ఆకాశంలోనూ, అటునుండి అమ్మవారిలోనూ ఐక్యమయి పోతాడు జీవుడు. అదే ముక్తి.

సాధన మొదలుపెట్టాలే కాని అమ్మవారు ప్రతీ మెట్టులోనూ సహకరిస్తూనే ఉంటారు.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీవారాహీదేవీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ